భగవత్ బాణాలు మోదీపైనే!

భగవత్ బాణాలు మోదీపైనే!

  దేశంలో రాజకీయం కొత్తరూపు సంతరించుకుంటోంది. ‘ఇండియా కూటమి’కి ప్రోత్సాహకరంగా, ‘ఎన్డీఏ కూటమి’కి సవాల్​గా మారుతున్న రాజకీయ వాతావరణంలో.... దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్​లోనూ రాజకీయం వేడెక్కుతోంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితులు పూర్తిగా కుదుటపడాలని రాజకీయపక్షాలు నిరీక్షిస్తున్నాయి. 

ఏడు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు విపక్ష ఇండియా కూటమికి ఉత్సాహాన్నిస్తే, పాలక ఎన్డీఏ కూటమిని నిరాశపరిచాయి. దేశంలో అప్పుడే మొదలైన ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది సంకేతమా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారాస్త్రాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, వాటి మిత్ర పక్షాలు పదునుపెడుతున్నాయి. 

బీజేపీని గాడిన పెట్టడానికి, దాని సైద్ధాంతిక మాతృక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరింత క్రియాశీలకంగా నడుంకట్టింది. ఇకపై ప్రధాని మోదీకి ఆర్ఎస్ఎస్ గుడ్డిగా మద్దతు లభించకపోవచ్చని మోహన్ భగవత్ మాటలే చెబుతున్నాయి. ఎందుకో తెలీదు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య అంతరం పెరుగుతోంది. మోదీకి ఆర్ఎస్ఎస్ మద్దతు తగ్గి, ‘ఇండియా కూటమి’కి జనాదరణ పెరిగితే దేశ రాజకీయాలకు కొత్తరూపు ఖాయం.

ఎన్డీఏ నాయకత్వానికి ‘మోదీ 3.0’లో ఆరంభం నుంచే ఇక్కట్లు మొదలయ్యాయి. ఇంటా -బయటా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఆశించిన స్థాయిలో రాలేదంటే, అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ నుంచి, ఎన్డీఏ ఇతర భాగస్వాముల నుంచీ విమర్శలు ఎదురవుతున్నాయి. బీజేపీ నాయకత్వం తప్పుడు రాజకీయ నిర్ణయాలు, అతి విశ్వాసపు విపరీత వైఖరి వల్లే ప్రజావ్యతిరేకత పెరుగుతోందన్నది ఈ విమర్శల సారం. 

ఈ కోణంలో సాఫీగా సాగిన మోదీ 1.0, మోదీ 2 .0 లో ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ‘అబ్ కీ బార్ చార్​సౌ పార్’ అని ప్రచారం ఊదరగొట్టినా.. 2019 కన్నా 63 స్థానాలు తగ్గి, తాజా ఎన్నికల్లో 240 వద్దే బీజేపీ స్కోరు ఆగిపోవడం మొదటి దెబ్బ! ‘ఇది బీజేపీ/ఎన్డీఏకు నైతిక, రాజకీయ పరాజయమే కాకుండా పార్టీ అగ్రనేత ప్రధాని మోదీకి వ్యక్తిగత పరాజయం’ అని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఎన్డీఏకు వ్యతిరేకంగా రావటం మరో దెబ్బ. ఇది పార్టీ అగ్రనాయకత్వానికి కొంత కలవరపాటునే కలిగిస్తోంది. 

స్థానిక అంశాలతో కాంగ్రెస్​ లబ్ధి

ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, ‘కొందరు మానవదశ దాటి ‘దేవత’, ‘భగవాన్’ ‘విశ్వరూప్’ అయిపోవాలనుకుంటున్నారు’ అని చేసిన వ్యాఖ్యలు, ఇకపై సంఘ్ అనుసరించబోయే  వైఖరికి సంకేతాలుగానే ఆ ‘మతలబు’లని తెలిసినోళ్లు అన్వయిస్తున్నారు. 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి దక్కింది 2 మాత్రమే!  ‘ఇండియా కూటమి’కి 10 స్థానాలు లభించగా ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. 

రాష్ట్రాల్లో ఫలితాలకు స్థానికాంశాలే కారణమని, ఇది కేంద్ర ప్రభుత్వంపై  ప్రజావ్యతిరేకత కాదని బీజేపీ చెబుతోంది. అంతకుముందు,  అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికాంశాలనే తెరపైకి తెచ్చినచోట కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లబ్ధి పొందాయి.  హిమాచల్ ప్రదేశ్, కర్నాటక,  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఎక్కడికక్కడ వ్యూహ రచన, స్థానికాంశాలకు ప్రాధాన్యతనివ్వటం వల్లే సాధ్యపడింది. అలాకాక జాతీయాంశాలే ప్రాధాన్యత సంతరించుకున్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్,  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింది. 

కాంగ్రెస్​ తిప్పి కొడుతున్నది

అవినీతి రహిత, పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనేది  షా ప్రచారం. వీటిని కాంగ్రెస్ గట్టిగానే తిప్పికొడుతోంది. ‘హర్యానా మాంగే ఇసాబ్’ (హర్యానా లెక్క అడుగుతోంది) అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే యత్నం చేస్తోంది. పెరుగుతున్న నేరాలు,  ద్రవ్యోల్బణం,  నిత్యావసరాల ధరలు,  నిరుద్యోగిత వంటి కీలకాంశాల్లో  లెక్కలు కావాలంటోంది.

  రైతులు కష్టాలపాలయ్యేలా పాలనను వరుసగా పదేళ్లు భ్రష్టుపట్టించి, ఇంకా ఆనాటి కాంగ్రెస్ పాలననే నిందిస్తారా? అన్నది వారి ప్రశ్న!  బీజేపీ పలుకుబడి పలుచనవుతున్నట్టు లోక్​సభ ఫలితాలు తెలుపుతున్నాయి.  2014లో,  2019 లో  హర్యానాలోని మొత్తం పది లోక్​సభ స్థానాలు బీజేపీ గెలుచుకోగా నిన్నటి ఎన్నికల్లో బీజేపీకి 5, కాంగ్రెస్​ 5 స్థానాలు లభించాయి.

సంఘ్  అంకుశం జడిపిస్తోంది!

మోహన్ భగవత్ ఘాటైన విమర్శల నుంచి మొన్నటి ‘ఆర్గనైజర్’ వ్యాసం, నిన్నటి ‘వివేక్’ వారపత్రిక కథనాల దాకా బీజేపీ నాయకత్వం, ముఖ్యంగా మోదీ- షా ద్వయం వైఖరిపై సంఘ్ సైద్ధాంతిక దాడి కొనసాగుతూనే ఉంది. కనీసం అంతర్గత వేదికల్లోనైనా బీజేపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడే పరిస్థితి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్  కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల తరుణంలో, ఇదంతా బీజేపీ నాయకత్వానికి చికాకే!  హిందూత్వ రీత్యా శివసేన (ఏక్​నాథ్ షిండే)తో  సాంగత్యం సహజంగా ఉంటుందే తప్ప ఎన్సీపీ  చీలకవర్గం (అజిత్ పవార్)తో  పొత్తు సరైన నిర్ణయం కాదని,  దానికి ప్రజామోదం లభించలేదని ‘వివేక్’ తప్పుబట్టింది. 

 మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, దరిమిలా ఎన్డీఏ వైఫల్యానికి ఈ తప్పుడు వైఖరే కారణమని ఎత్తిచూపింది. 48 లోక్​సభ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 9కి కుంచించుకు పోవడాన్ని (2019లో 23 గెలిచింది) ఎత్తిచూపింది. పార్టీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోయాయని, కార్యకర్త నిరుత్సాహపడలేదు. కానీ అయోమయానికి గురయ్యాడు’ అనే శీర్షికతో ఈ కథనం నడిచింది. 

కార్యకర్తలను కూడా నాయకులను చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, ఆ పద్ధతికి తిలోదకాలిచ్చి బయటివారిని చేర్చుకుంటూ అందలాలు ఎక్కిస్తున్నారనే వేదన పార్టీ శ్రేణుల్లో బలపడుతున్నట్టు రాసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఈ భావన బలంగా వ్యక్తమౌతోంది. ఈటల రాజేందర్ వంటి వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించొద్దు అంటున్నవారిది ఇదే వాదన! అంతకు ముందు ‘ఆర్గనైజర్’లో ప్రచురితమైన రతన్ శారద వ్యాసంలో 2024 ఫలితాలను ‘మితిమీరిన బీజేపీ నాయకత్వపు అతివిశ్వాసానికి వాస్తవిక పరీక్ష’ అని పేర్కొనడంతో ఆర్ఎస్ఎస్ సమీక్ష ప్రజాక్షేత్రంలోకి రావడం మొదలైంది.

మౌర్య వ్యాఖ్యలు పెరుగుతున్న విభేదాలకు సూచనా?

‘పార్టీ కన్నా ఎవరూ గొప్ప కాదు, చివరకు ప్రభుత్వం కూడా కాదు. కార్యకర్తల కఠిన శ్రమతోటే పార్టీ’ అని బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్న మాటలు సీఎం యోగిని ఉద్దేశించే! వారిద్దరి మధ్య ఎంత అంతరం వచ్చిందంటే, గత పది భేటీల నుంచి ఆయన మంత్రిమండలి సమావేశాలకూ వెళ్లటం లేదు. మౌర్యతో భేటీ అయి వచ్చిన తర్వాత నిషాద్ పాలకపక్షానికి వ్యతిరేకంగా వ్యాఖ్య చేశారు.

 ప్రభుత్వంలో మరో భాగస్వామి అప్నాదళ్(ఎస్) అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కూడా యూపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎస్సీలు, ఓబీసీలకు రిజర్వు చేసిన ఉద్యోగాలు ఓసీలతో నింపుతున్నారనేది ఆమె అభియోగం! యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అంతరం బీజేపీ, ఆర్ఎస్ఎస్​ మధ్య పెరుగుతున్న అంతరానికి ప్రతీకనా?  ఏమో? కాలమే చెబుతుంది.

హర్యానాలో  కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం

హర్యానాలో కాంగ్రెస్​ది​ అవినీతి పాలన అని,  కులాలవారీగా ప్రజల్ని విభజించడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని బీజేపీ విమర్శిస్తోంది. ఓబీసీలకు, వారికి రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారాన్ని విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.  ఓబీసీలకు 1950లలో ‘కాకా కేల్కర్ కమిషన్’ చేసిన రిజర్వేషన్  సిఫార్సులను  అమలుచేయకుండా కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా చేసిన ఇటీవలి విమర్శ ఈ ఎత్తుగడలో భాగమే!  ‘మండల్ కమిషన్’ సిఫార్సుల నివేదికను నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొక్కిపెట్టారని, రాజీవ్​ గాంధీ కూడా ఓబీసీ రిజ్వేషన్లు అమలుపరచలేదన్నది బీజేపీ విమర్శ. 

యూపీ బీజేపీ ఉడుకుతోంది!

ఎన్డీఏకు ప్రతికూల ఎన్నికల ఫలితాల వెనుక ‘బుల్డోజర్ దుర్వినియోగం’ ఉందని ఎన్డీఏ భాగస్వామి సంజయ్ నిషాద్ అన్నారు. ‘పేదలను పెకిలించి వేస్తామంటే, వారు మనల్నే రాజకీయంగా పెకిలించి వేస్తారు’  అని ఆయన చేసిన వ్యాఖ్య,  యూపీలో బీజేపీ ప్రతిష్ట, లోక్​సభలో ప్రాతినిధ్యం పడిపోవడానికి బలమైన కారణాన్ని చూపెడుతోంది. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో సభ్యుడు, నిషాద్ పార్టీ నేత సంజయ్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టాయి. ఎస్పీ, బీఎస్పీ పార్టీల మేలుకోరే అధికారుల వల్లే ఈ బుల్డోజర్ దుర్వినియోగ పర్వం సాగిందంటారాయన.
 
దిలీప్​రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ