
- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
వారణాసి: ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదం చేసే వారికి, కాషాయ జెండా పట్ల గౌరవం ఉండే వారికి ఆర్‌ఎస్‌ఎస్ శాఖలలో స్థానం ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాలుగు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ఆదివారం మోహన్ భగవత్ లజ్‌పత్ నగర్ కాలనీలో జరిగిన శాఖ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలు శాఖలలో చేరవచ్చా.. అని ఒక స్వయం సేవక్ భగవత్‌ను అడగగా, ఆయన సమాధానమిచ్చారు. ‘‘భారతీయులందరికీ శాఖలు స్వాగతం పలుకుతాయి.
శాఖలో చేరడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ‘భారత్ మాతా కీ జై’అని నినాదాలు చేయడానికి సంకోచించకూడదు. అలాగే, కాషాయ జెండా పట్ల గౌరవం ఉండాలి” అని స్పష్టం చేశారు. కుల వివక్షను అంతమొందించి, పర్యావరణ, ఆర్థిక, ఇతర సమస్యలపై దృష్టి సారించి బలమైన సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాలు, కులాల్లోని ప్రజలకు శాఖలు స్వాగతం
పలుకుతున్నాయని వెల్లడించారు.