తలుపు తట్టి మరీ చెబుతారు!

‘సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ)’తో ఏ మతానికీ ఏ నష్టమూ లేదని మోడీ సర్కారు క్లియర్​ కట్​గా చెబుతోంది. మరి అల్లర్ల మాటేమిటి? కొందరు పనిగట్టుకుని లేనిపోని అనుమానాలు కల్పిస్తున్నారని ఆరెస్సెస్ అంటోంది. ప్రజల్లో అపోహలు తొలగించాలని నిర్ణయించుకుంది. చట్టంపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఆయియే.. జానే సీఏఏ’ పేరుతో పాంప్లెట్లు పంచుతూ డోర్​-టు-డోర్​ క్యాంపెయిన్​ చేపడుతోంది.

పాకిస్థాన్​, అఫ్ఘానిస్థాన్​, బంగ్లాదేశ్​ల నుంచి వచ్చేసిన హిందూ, పార్సీ, జైన్, సిక్కు, బౌద్ధ, క్రైస్తవులకు ఇండియా ఐడెంటిటీ ఇవ్వటానికి తెచ్చిందే సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్ యాక్ట్​ (సీఏఏ). పైన చెప్పిన మూడూ ముస్లిం దేశాలే. అక్కడ ముస్లింలు మైనారిటీలు కాదు. వాళ్లకు మన దేశ గుర్తింపు ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. అందుకే వాళ్లను సీఏఏ పరిధిలోకి తేలేదు. ఈ విషయాల్ని పట్టించుకోని కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆరెస్సెస్​) వివరిస్తూ… దీన్ని జనంలోకి తీసుకుపోవాలనికూడా ప్రయత్నాలు చేస్తోంది.

నిజం బయలుదేరే లోపే అబద్ధం ఊరు తిరిగొస్తుందట. అలాగే, సీఏఏ సాకుతో కొందరు ఉద్దేశపూర్వకంగా జనాన్ని భయాందోళనలకు, గందరగోళానికి గురి చేస్తున్నారన్నది ఆరెస్సెస్​ అంచనా. దేశంలో రోజూ ఏదో ఒక చోట సీఏఏపై నిరసనలు జరగటానికి అపోహలే కారణమని, వాటిని తొలగించాలనే రంగంలోకి దిగింది. చట్టంపై అవగాహన కల్పించటానికి వివిధ కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేస్తోంది.

అబద్ధాలు– అసలు నిజాలు

సీఏఏ వల్ల పైన చెప్పిన మూడు దేశా​ల నుంచి మన దేశంలోకి భారీ వలసలు జరగనున్నాయన్నది ప్రచారంలో ఉందిగానీ, ఇది అబద్ధం. 2014 డిసెంబర్​ 31కి ముందు ఇండియా వచ్చిన ఇమ్మిగ్రెంట్స్​ అందరికీ సీసీఏ వర్తిస్తుందన్నది మరో అబద్ధం. ఈ విషయాలన్నీ డోర్​–టు–డోర్​ వెళ్లి వివరిస్తున్నామని, సీఏఏపై అల్లర్లు జరుగుతున్న ఏరియాలకు ప్రయారిటీ ఇస్తున్నామని ఆరెస్సెస్​ ప్రచారక్​లు చెబుతున్నారు. చట్టంలో అసలేముందో ప్రజలకు తెలియజేయటమే తమ లక్ష్యమని; సీఏఏ అనేది బీజేపీకో, ఆరెస్సెస్​కో సంబంధించిన ఇష్యూ కాదని అంటున్నారు.

ఎందరో మహానుభావులు–ముందే చెప్పారు

పాకిస్థాన్​, అఫ్ఘానిస్థాన్​, బంగ్లాదేశ్​లలో మతం పేరుతో వివక్షకు గురవుతున్న మైనారిటీలను రక్షించాల్సిన అవసరం ఉందని ఎందరో మహానుభావులు ఎప్పుడో చెప్పారని ఆరెస్సెస్ గుర్తు చేస్తోంది. మహాత్మా గాంధీ, తొలి ప్రధాని జవహర్​లాల్ ​నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బీఆర్​ అంబేద్కర్​, రామ్​మనోహర్​ లోహియా, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ,  రాజీవ్​గాంధీ, మన్మోహన్​సింగ్ వంటివారు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారని డోర్​ టు డోర్​ మీటింగుల్లో వివరిస్తోంది.

ఇదో గొప్ప విజయం

సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ చట్టం స్టూడెంట్స్​ని, వర్సిటీలను టార్గెట్​ చేయనుందనే అబద్దపు ప్రచారంవల్లే ఈ పరిస్థితి నెలకొందని పాంప్లెట్​లో వివరించారు. మూడు ముస్లిం దేశాల్లో అణచివేతలకు గురైనవారికి సీఏఏ గొప్ప విజయమని గర్వంగా చెబుతోంది. గతంలో ఈ బాధితులు పారిపోయి వచ్చి తలదాచుకోవటం తప్ప వేరే దిక్కే ఉండేది కాదని, ఇకపై అలాంటి ఘోరమైన పరిస్థితులు ఉండబోవని చెప్పడమే తమ క్యాంపెయిన్ ఉద్దేశమని ఆరెస్సెస్​ అంటోంది.

‘రండి.. అర్థం చేసుకోండి’

సీఏఏపై అవగాహన కార్యక్రమాల్లో ఆరెస్సెస్​ యంగ్​ ప్రొఫెషనల్స్​కి ప్రాధాన్యత ఇస్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, స్టూడెంట్లను, గృహిణుల్ని టార్గెట్​గా పెట్టుకుంది. 10–15 మందితో ప్రచారక్​లు మీటింగ్​లు పెడుతున్నారు. ‘ఆయియే.. జానే సీఏఏ  (రండి.. సీఏఏని అర్థం చేసుకోండి)’ అనే హెడ్డింగ్ ఉన్న రెండు పేజీల పాంప్లెట్లు పంచుతున్నారు. ఫ్రెండ్స్​కి​, ఫ్యామిలీ మెంబర్స్​కీ వాటిని ఇవ్వాలని, వారికి కూడా దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నారు. ‘సీఏఏపై అన్ని రకాలుగా రూమర్లు ప్రచారంలోకి తెస్తున్నారు. అందుకే మేం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం’ అని ఆరెస్సెస్​ ప్రతినిధి ఒకరు వివరించారు.