అన్నింటికన్నా దేశమే ఫస్ట్.. ఆర్ఎస్ఎస్‎పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

 అన్నింటికన్నా దేశమే ఫస్ట్.. ఆర్ఎస్ఎస్‎పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ముంబై: బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మార్చి 30) మహారాష్ట్రలోని నాగ్‎పూర్‎లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‎కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ రావిచెట్టు మాదిరి మహావృక్షంలా ఎదిగిందన్నారు. లక్షల మందిని దేశం కోసం పని చేసేలా ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించిందని తెలిపారు. 

ప్రజాసేవే దైవ సేవని ఆర్ఎస్ఎస్ నమ్మిందని.. అన్నింటికన్నా దేశమే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ బోధించిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్‎ను  ఆధునిక 'అక్షయ వట వృక్షం' (5100 సంవత్సరాల పురాతన మర్రి చెట్టు)గా అభివర్ణించారు. దేశంలోని వివిధ రంగాలు, ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకుల నిస్వార్థ సేవను మోడీ కొనియాడారు. మహాకుంభ్‎లో లక్షల సంఖ్యలో సేవ చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రశంసించారు. మాధవ్ తన జీవిత పర్యంతం సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Also Read : బీజేపీ విధానాలతో ‘బ్యాంకింగ్’ ​సంక్షోభం

పేదల్లోనే అత్యంత పేదలకు ఉత్తమ వైద్య చికిత్సను అందించడమే మా ప్రభుత్వ విధానమని మోడీ స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల కోట్లాది మందికి ఉచిత వైద్య చికిత్సలు అందుతున్నాయని తెలిపారు. పదేళ్లలో గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించామని.. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యతో పాటు మెడికల్ సీట్లు కూడా పెరిగాయని పేర్కొన్నారు. 

రానున్న సంవత్సరాల్లో నైపుణ్యం కలిగిన అధిక శాతం డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. విద్యార్థుల మాతృభాషలో వైద్య విద్యను అందించాలని మేము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని.. ఇది వెనుకబడిన నేపథ్యాల పిల్లలు కూడా వైద్య వృత్తిని కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చౌక ధరలకే మందులు అందజేస్తున్నామని చెప్పారు.