
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాస్తోందని.. రాజ్యాంగానికి విరుద్ధమని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో విమర్శిస్తున్నాయి. ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, మహ్మద్ జావేద్ మరొ అడుగు ముందుకేసి వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా వక్ఫ్ సవరణ బిల్లు అంశం వాడీవేడీగా ఉన్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత దేశంలో అతిపెద్ద భూస్వాములు కాథలిక్ సంస్థలే.. దాదాపు 7 కోట్ల హెక్టార్ల భూమిని ఆ సంస్థలు కలిగి ఉన్నాయి. క్యాథలిక్ సంస్థలు అతిపెద్ద ప్రభుత్వేతర భూ యజమానులుగా ఉన్నాయి’ అని ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఆర్గనైజర్ వైబ్‌సైట్ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ముస్లింలపై దాడి చేశారు.. ఇక ఆర్ఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ క్రైస్తవ సమాజమే కావచ్చని రాహుల్ గాంధీ ఆరోపించారు.
►ALSO READ | మరాఠీ మాట్లాడటం ఇష్టం లేకపోతే మహారాష్ట్ర విడిచి వెళ్లండి: MNS లీడర్ వార్నింగ్
‘‘వక్ఫ్ బిల్లు ముస్లింలపై దాడి చేస్తుందని చెప్పా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మరో వర్గాన్ని (క్రైస్తవ) లక్ష్యంగా చేసుకుంది. దానికి ఆర్గనైజర్ కథనమే ఒక ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ క్రైస్తవుల వైపు దృష్టి సారించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అటువంటి దాడుల నుండి మన ప్రజలను రక్షించే ఏకైక అస్త్రం రాజ్యాంగం. -దానిని రక్షించడం మన సమిష్టి విధి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల కూడా ఆర్గనైజర్ కథనంపై స్పందించాడు. ఈ కథనాన్ని "దుర్భరమైనది" ఆయన అభివర్ణించాడు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కాథలిక్ సంస్థల యాజమాన్యంలోని ఆస్తులను నియంత్రించడమేనని ఆరోపించారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ క్రైస్తవులేనని వక్ఫ్ బిల్లు ఆమోదం సమయంలోనే కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.