
- రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజంలోకి తీసుకెళ్లేలా నవంబర్ నుంచి మూడు నెలల పాటు ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ వెళ్లేందుకు జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి గ్రామగ్రామానికి సంఘ్ శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ నెల 21 నుంచి 23 వరకూ బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల్లో చేసిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలను హైదరాబాద్ లో సంఘం ఆఫీసులో ఆయన మీడియాకు వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేండ్లు కావొస్తున్న నేపథ్యంలో సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు 83,129 నడుస్తున్నాయని వివరించారు. తెలంగాణలో మొత్తం 1,839 స్థలాల్లో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని తెలిపారు. స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘ్ విస్తరణ ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.