మధ్యప్రదేశ్ లో ఆ 28 సీట్లను RSS గెలిపించింది

మధ్యప్రదేశ్‌లో 16 ఏళ్లుగా పాతుకుపోయిన బీజేపీని కాంగ్రెస్‌ దెబ్బతీసింది. కేవలం 15 సీట్ల తేడాతో కాషాయదళం పవర్‌ చేజార్చుకుంది. దీనిని సవాల్‌గా తీసుకుని బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ రంగంలో దిగింది. సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలకు ‘జీతో మధ్యప్రదేశ్‌’ టార్గెట్‌ ఫిక్స్‌ చేసింది.  ఈ ఆరు నెలల్లోనూ వాళ్లు గడప గడపకీ  డైలీ బేసిస్‌గా వెళ్లి సెంటర్‌లో బీజేపీ ప్రభుత్వం ఎందుకుండాలో  వివరించారు. ఓటేయడానికి బద్దకించేవాళ్లను మోటివేట్‌ చేశారు. సంఘ్‌ పరివార్‌  కృషితో ఒక్క చింద్వాడా మినహా అన్ని సీట్లనూ బీజేపీ గెలుచుకుంది.

కిందటేడాది చివరలో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి గట్టిగా ఆరు నెలలు కాలేదు. 2003 నుంచి దాదాపు 16 ఏళ్లపాటు ముగ్గురు సీఎంలతో అధికారంలో కొనసాగిన బీజేపీని కాంగ్రెస్‌ కంగు తినిపించింది. అయినాగానీ, ఈ విజయం ఆరు నెలలకే ఆవిరై పోయింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకోలేకపోయింది. రాష్ట్రంలోని మొత్తం 29 లోక్ సభ సెగ్మెంట్లలో బీజేపీ 28 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇదేదో ఆషామాషీగా లభించిన విజయం కాదు. దీని వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తల రాత్రింబవళ్ల కృషి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ మార్జిన్‌తో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ కార్యకర్తలను బాగా బాధించింది.  23 సీట్ల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కి 114 రాగా, బీజేపీ 109 సీట్లు గెలిచింది. కేవలం 15 సీట్ల తేడాతో పవర్‌ చేజారిపోయేసరికి బీజేపీ కార్యకర్తలు డీలా పడ్డారు. ఆ పరిస్థితుల్లో ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. ఆరెస్సెస్‌కి చెందిన మూడు  విభాగాలు ‘వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్’,  ‘విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్’, ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ రంగంలో దిగాయి. వీటితో పాటు ‘విశ్వ హిందూ పరిషత్’  కార్యకర్తలు కూడా తోడుగా వచ్చారు. లోక్‌సభ ఎన్నికల కేండిడేట్లను ఖరారు చేయడానికి ముందుగానే వీరంతా తమ పని మొదలెట్టారు.  బీజేపీ బలహీనంగా ఉందని భావించే  నియోజకవర్గాల జాబితాను ముందుగా తయారు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి  ఇంతమంది అంటూ  కార్యకర్తలను ఎంపిక చేసి పంపారు.

ఆయా నియోజకవర్గాలకు వెళ్లిన కార్యకర్తలు అక్కడి జనంతో ముఖ్యంగా యువత, ఆడవారు, రైతులతో  ప్రతి రోజూ మాట్లాడటం మొదలెట్టారు. ఈ మాటల్లో రాజకీయాల ప్రస్తావన ఎక్కడా వచ్చేది కాదు. కేవలం దేశం, దేశ భద్రత మాత్రమే ప్రస్తావనకు వచ్చేది. ఏ సర్కార్ అధికారంలోకి వచ్చినా ప్రపంచ దేశాల ముందు ఇండియా తల ఎత్తుకుని గర్వించేలా పనిచేయాలని చెప్పేవారు. దేశభక్తి అనే అంశాన్ని ఎదుటి వారి  గుండెల్లో హత్తుకుపోయేలా మాట్లాడేవారు. ఉదయం ఆరు గంటలకే  ఆరెస్సెస్ కార్యకర్తల పని మొదలయ్యేది. ఆ రోజు ఏఏ ప్రాంతాలను కవర్ చేయాలి, ఏఏ గ్రూపులను కలవాలి అనేది ముందుగానే డిసైడ్ చేసుకునేవారు. ఎవరు ఎక్కడకు వెళ్లాలి అనే వర్క్ డివిజన్ కూడా చేసుకునే వారు. షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. దేశ భద్రత అనే అంశం ఎంత ఇంపార్టెంటో చెప్పేవారు. పొరుగుదేశాల నుంచి ఇండియాకు ఉన్న ముప్పును వివరించే వారు. అక్షరమ్ముక్క  చదువుకోని వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ విషయాలను వివరించేవారు. ఈ ప్రచారం ఇక్కడితో ఆగలేదు.దేశభద్రత, ఆర్థికాభివృద్ది వంటి విషయాలపై వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి  ఫీడ్ బ్యాక్ పత్రాలను కూడా ఇచ్చి ఆ తర్వాత వాటిని కలెక్ట్ చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వీరి ప్రచారం జోరందుకుంది. జట్లు జట్లుగా విడిపోయి అన్ని ప్రాంతాలను టచ్ చేశారు.

భోపాల్ సహా కొన్ని సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి…

మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 నియోజకవర్గాల్లో కొన్ని సెగ్మెంట్లపై  ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటిలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ పోటీ చేసి ఓడిపోయిన భోపాల్ సహా మరికొన్ని నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ దాదాపుగా ఇంటింటికీ ఈ కార్యకర్తలు తిరిగారు. బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికి బద్ధకించే కుటుంబాలనుకూడా గుర్తించారు. వారికి ఓటు హక్కు విలువను వివరించారు. అవసరమైతే రెండు మూడు సార్లు ఆ కుటుంబ పెద్దలను కలిసేవారు. ఓటేసేలా వారిని మోటివేట్ చేశారు. వారానికి ఓ రోజు ఆరెస్సెస్ నుంచి ఓ ప్రముఖ నాయకుడు ఆయా ప్రాంతాల్లో టూర్  చేశారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కార్యకర్తలతో భేటీ అయ్యే వారు. కేడర్‌కి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేవారు.

ఇండోర్‌లోనూ…

ఇండోర్‌లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన శంకర్ లాల్వానీ తొలి రోజుల్లో ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది. రద్దయిన  లోక్‌సభకు స్పీకర్ గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. అయితే వయసు కారణంగా ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆరెస్సెస్ నుంచి వచ్చిన శంకర్ లాల్వానీకి టికెట్ దొరికింది. దీంతో సుమిత్ర అభిమానుల నుంచి లాల్వానీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆరెస్సెస్  కార్యకర్తల ఆర్నెల్ల కృషి ఫలించడంతో  ఇక్కడ లాల్వానీ గెలవగలిగారు.

ఆరెస్సెస్ ప్లాన్ సక్సెస్‌ …

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆరెస్సెస్ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క చింద్వాడా సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

సింధియాల కంచుకోట బద్దలు…

మధ్యప్రదేశ్ లోని గుణ సెగ్మెంట్ కు ఒక ప్రత్యేకత ఉంది. సింధియా కుటుంబానికి కంచుకోటగా ఈ సెగ్మెంట్‌కి  రాజకీయ వర్గాల్లో పేరుంది.  అయితే ఈసారి నరేంద్ర మోడీ సునామీ ఈ నియోజకవర్గాన్ని కూడా తాకింది. కాంగ్రెస్ యంగ్‌ లీడర్ జ్యోతిరాదిత్య సింధియా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గుణ నియోజకవర్గానికి జ్యోతిరాదిత్య సింధియా సిట్టింగ్ ఎంపీ. 2014 లో మోడీ ప్రభంజనాన్ని తట్టుకుని లక్ష ఓట్ల మెజారిటీతో జ్యోతిరాదిత్య సింధియా ఇక్కడి నుంచి విజయం సాధించారు.  సింధియా కుటుంబానికి గుణ సెగ్మెంట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. జ్యోతిరాదిత్య నాయనమ్మ విజయ రాజె సింధియా 1989 నుంచి 1998 వరకు వరుసగా నాలుగుసార్లు  బీజేపీ టికెట్‌పై ఇక్కడి నుంచి గెలిచార తర్వాత 1999లో మాధవరావు సింధియా కాంగ్రెస్​ టిక్కెట్​పై ఎన్నికయ్యారు. 2001లో మాధవ రావు సింధియా చనిపోవడంతో 2002 లో ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించారు. వరుసగా నాలుగు సార్లు ఇదే స్థానం నుంచి గెలిచారు.