2 నెలలు ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్

2 నెలలు ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్
  • ట్యాక్స్ లు కట్టకుండా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలకు సిద్ధం

హైదరాబాద్​సిటీ, వెలుగు : సిటీలో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ నడుం బిగించింది. శనివారం నుంచి మార్చి 31 వరకూ రెండు నెలల పాటు స్పెషల్​ డ్రైవ్​నిర్వహించనున్నట్టు తెలిపింది. నిజానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ముఖ్యంగా ఫోర్​వీలర్స్​, మినీ బస్సులు, వ్యాన్​లు వంటివి రాష్ట్రంలో తిరిగేందుకు పరిమిత కాలం అనుమతి ఇస్తుంటారు. ముఖ్యంగా టూరిస్టుల పేరుతోనూ, మెడికల్​ అవసరాల దృష్ట్యా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు నెల రోజుల వరకు అనుమతి ఇస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. 

గడువు తీరిపోయినా చాలా మంది వాహన దారులు ఇక్కడే తిష్టవేసి ట్రావెలింగ్​వ్యాపారాలు, ఇతర పనులను నిర్వహించుకుంటున్నారు. అయితే ఇలాంటి వాహనాలు తెలంగాణలో తిరగాలంటే తప్పని సరిగా రోడ్​టాక్స్ చెల్లించాలి. లేదా తెలంగాణలో రిజిస్టర్​చేయించుకోవాలి. అలా కాకుంటే తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో భారీ సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వాహనదారులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం నగరంలో 600 నుంచి 700 ఇతర రాష్ట్రాలకు చెందిన కార్లు తిరుగుతున్నట్టు తెలిపారు. 

వీరు ఎలాంటి అనుమతి పొందకుండా, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తిరుగుతున్నాయన్నారు. ఇందులో ప్రధానంగా క్యాబ్ లు, ఐటీ కంపెనీలకు అద్దెకు వచ్చినవే అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే టూవీలర్​ వాహనాలు దాదాపు 1100 వరకు ఉంటాయన్నారు. ఇవి కాకుండా గూడ్స్​వాహనాలు మరో 300 వరకు ఉన్నట్టు అంచనా. 2023 ఫిబ్రవరిలో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్​లో ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చి  తెలంగాణలో తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేసి  వారి  నుంచి దాదాపు రూ.96 కోట్ల పెనాల్టీ వసూలు చేశారు. తాజాగా నగరంలో ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్​ కంపెనీలు, ప్యాకేజింగ్, రవాణాకు సంబంధించిన కార్యకలాపాల్లో భారీ సంఖ్యలో కార్లు, భారీ వాహనాలు తిరుగుతున్నాయని వీటిని గుర్తించి, జరిమానాలు విధించనున్నట్టు అధికారులు తెలిపారు. 

చర్యలు తీసుకుంటాం

ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు నగరంలో తిరగాలంటే ఇక్కడికి వచ్చిన 30 రోజుల్లో చేంజ్​ ఆఫ్​ అడ్రస్​ మార్పు చేసుకోవాలని జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ రమేశ్​కుమార్​ తెలిపారు. అలాగే వేరే రాష్ట్రం వారు ఇక్కడ వాహనాలు కొనుగోలు చేసినా 14 రోజుల్లో రిజిస్ట్రేషన్​చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవేమీ లేకుండా నగరానికి వచ్చిన అనేక వాహనాలు ప్రస్తుతం నగరంలో తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీరిపై చర్యలు తీసుకుంటాం. - జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ ​రమేశ్​ కుమార్