ఆర్టీఏ ఆఫీసుల్లో దళారుల దందా!

ఆర్టీఏ ఆఫీసుల్లో దళారుల దందా!
  •    అధికారులను బెదిరించి పనులు చేయించుకుంటున్న వైనం
  •     కొందరు అధికారులే దళారులను ప్రోత్సహిస్తున్నరనే ఆరోపణలు
  •     ఆఫీసర్లతోనూ సన్నిహిత సంబంధాలు నెరపుతున్న దళారులు
  •     జేటీసీపై దాడి ఘటనతో పెన్​డౌన్​ చేసిన ఆర్టీఏ ఉద్యోగులు

హైదరాబాద్,వెలుగు: ఆర్టీఏ ఆఫీసులు దళారుల దందాకు అడ్డాగా మారాయి. వారు చెప్పిన పని చేయకపోతే అధికారులనే బెదిరించే స్థాయికి కొందరు దళారులు ఎదిగారు. వారిని కట్టడి చేయడం అధికారులకు కూడా సాధ్యం కావడం లేదు. ప్రతి రోజూ ఆర్టీఏ ఉద్యోగులుగా టైమ్ కు ఆఫీసుకు వస్తుంటారు.  వివిధ పనులపై వచ్చే వాహనదారులకు పనిచేసి పెడతామంటూ భారీగా వసూలు చేస్తుంటారు. ఇది ఒక్క ఆఫీసుకే పరిమితం కాలేదు. సిటీలోని అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లోనూ దళారుల హవా నడుస్తోంది. జాయింట్​ట్రాన్స్​పోర్ట్​కమిషనర్​(జేటీసీ)నే చెంపదెబ్బ కొట్టే సాహసం చేసిన ఓ ఆటో యూనియన్​ నేత దళారీగా మారాడు. 

ఆపై అధికారులతో పనులు చేయించుకోవడం, చేయకపోతే బెదిరించి కొట్టే పరిస్థితి ఏర్పడిందంటే కొందరు అధికారులే దళారులను  ప్రోత్సహిస్తున్నారనే వాదన కూడా ఉంది. గురువారం జేటీసీపై దాడి జరిగిన ఘటనకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారులు, ఉద్యోగులు పెన్​డౌన్​ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారిపై దాడి చేసిన అమానుల్లాఖాన్​ను అరెస్ట్​ చేయాలని నినాదాలు చేశారు. వాహనదారుల పనులన్నీ ఆన్​లైన్​లోనే చేస్తున్నట్టు ఒక పక్క అధికారులు చెబుతున్నా.. చాలా పనులు ఆఫీసులకు వెళ్తేకాని పూర్తి కావడం లేదు. 

ఆయా పనులపై వెళ్తే అధికారులు అందుబాటులో ఉండరు. ఏ పని కావాలన్నా దళారులే దిక్కవుతున్నారు. నేరుగా అధికారితో పనిలేకుండా  ఒక ఏజెంట్​తో ఆర్టీఏకు సంబంధించి ఏ పనైనా అయిపోతుందంటే అధికారుల వద్ద వారికున్న పలుకుబడి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  గ్రేటర్​సిటీలోని అన్ని జోనల్ ఆర్టీఏ ఆఫీసుల్లో దళారులు తిష్టవేసి పనుల కోసం వచ్చే వాహనదారుల నుంచి భారీగానే  వసూళ్లు చేస్తున్నారు. 

 అధికారుల ప్రోత్సాహం!

 ఆర్టీఏ ఆఫీసుకు ఏ పని కోసం వెళ్లినా ముందుగా ఎదురయ్యేది దళారులే. ఏం పని కావాలి?  డ్రైవింగ్​ లైసెన్సా? రెన్యువలా? కొత్త బండి రిజిస్ట్రేషనా? ఇలా ప్రశ్నలతో అక్కడికి వచ్చిన వారి వెంటపడతారు. పని కోసం వచ్చిన వారికి ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకపోతుండగా చాలా మంది బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు.  వారైతే అన్ని పనులు చేసి పెట్టి ఫలానా పనికి రేటు ఫిక్స్​చేసి వసూలు చేస్తుంటారు. సిటీలో ఐదు ఆర్టీఏ జోనల్ ఆఫీసులు ఖైరతాబాద్​, సికింద్రాబాద్​, మలక్​పేట, బండ్లగూడ, మెహదీపట్నం, నాగోల్​(డ్రైవింగ్​ట్రాక్​) ఉండగా..  మేడ్చల్​ జిల్లాలో మణికొండ, కూకట్ పల్లి, హైటెక్​సిటీ, ఉప్పల్ లోని ఆర్టీఏ ఆఫీసుల వద్ద పదుల సంఖ్యలో దళారులే కనిపిస్తుంటారు. 

వీరు వాహనదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత అధికారులు, ఉద్యోగులకు వాటా వెళ్తుందనే వాదన ఉంది. అందుకే ఆర్టీఏ ఆఫీసుల్లోకి ఏజెంట్లను రానివ్వకుండా ఎవరూ ఆపే పరిస్థితి లేదు. లెర్నింగ్​ లైసెన్స్​ కోసం వచ్చిన వారు కూడా టెస్ట్ ల్లో ఫెయిల్​అయినా ఏజెంట్లను సంప్రదిస్తే క్షణాల్లో పని పూర్తి చేయిస్తారు.  టెస్ట్​ డ్రైవింగ్​లోనూ ఇదే పరిస్థితి. డ్రైవింగ్​ లైసెన్స్​రెన్యువల్​, కొత్త లైసెన్స్​లోనూ దళారులే కీ రోల్ గా ఉంటారు.  కొందరు ఏజెంట్లు ఈజీగా ఆఫీసర్ల వద్దకు వెళ్లగలరు. వాహనదారులు వెళ్లాలంటే మాత్రం కుదరదు. 

అమానుల్లాఖాన్​వంటి కొందరు యూనియన్ల పేరు చెప్పుకుని ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటారు. వారితో కూడా కొందరు అధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. అందుకే మరీ బెదిరించి పనులు చేయించుకునే స్థాయికి పరిస్థితి చేరింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్​, లెర్నింగ్​ లైసెన్స్​, డ్రైవింగ్​ టెస్ట్​లు అన్నీ కూడా ఆన్​లైన్​ లోనే అప్లై చేసుకోవడం ద్వారానే అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతుంటారు.  కానీ ఏజెంట్లతోనే అన్ని పనులు అవుతుండడం గమనార్హం. 

ఏసీబీ దాడులు జరిగినా మారని పరిస్థితి

ఆర్టీఏ ఆఫీసుల్లోని అవినీతి గురించి తెలిసి నెల రోజుల కిందట ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా చెక్​పోస్టుల వద్ద మారువేషాలు వేసుకుని మరీ అక్రమాలను ప్రత్యక్షంగా చూసి కేసులు బుక్​చేశారు. గ్రేటర్​సిటీలోనూ ఏసీబీ దాడుల్లో కొందరు ఏజెంట్లను పట్టుకున్నట్టు సమాచారం. ఇలా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో బ్రోకర్లు తిష్టవేసి ఉన్నట్టు చెబుతున్నారు. 

వీరి వద్దకు వెళితే ఏ పని అయినా ఈజీగా జరిగిపోతుందని అంటున్నారు. ఒక్కో ఆర్టీఏ ఆఫీసులో రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు దందా నడుస్తున్నట్టు సమాచారం. ఏసీబీ దాడుల తర్వాత కొన్నిరోజుల పాటు ఆఫీసుల్లో ఏజెంట్లు కనిపించలేదు. కానీ కొన్ని రోజులకే మళ్లీ అన్ని జోనల్​ ఆఫీసుల్లోనూ వారిదే హవా నడుస్తోంది. ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసులో జరిగిన ఘటనతోనైనా అధికారులు ఏజెంట్లను ప్రోత్సహించకుండా, వారిని ఆఫీసులకు రాకుండా చర్యలు తీసుకుంటే మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని పలువురు అంటున్నారు.