స్కూల్, కాలేజీల బస్సుల్లో సగానికి పైగా అన్​ఫిట్

స్కూల్, కాలేజీల బస్సుల్లో సగానికి పైగా అన్​ఫిట్
  • గ్రేటర్​లో దాదాపు 4 వేల బస్సులు 15 ఏండ్లు నిండినవే..
  • విద్యా సంవత్సర ప్రారంభంలో అధికారుల హడావిడి
  • తూతూ మంత్రపు చర్యలతో మమ..
  • ఈ ఏడాది 50 శాతం బస్సులు ఫిట్​నెస్​టెస్టులకు రాలే 
  • మంత్రి పొన్నం ఆదేశాలతోనైనా చర్యలు తీసుకునేనా? 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఫిట్​నెస్ లేని స్కూల్​బస్సులు​యథేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు యేటా వాహనాలకు ఫిట్​నెస్​ టెస్టులు చేయించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఆర్టీఏ అధికారులు స్కూల్​బస్సులు, వ్యాన్లకు ఫిట్​నెస్​పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారు.

ఈసారి కూడా ఇలాగే ఆదేశాలు జారీ చేయగా యాజమాన్యాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో తనిఖీలు నిర్వహించి ఫిట్​గా లేని 200 స్కూల్​ బస్సుల ఓనర్లపై కేసులు నమోదు చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​మూడు రోజుల కింద నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో గ్రేటర్​పరిధిలో ఫిట్​నెస్​లేని, కాలం తీరిన వాహనాలను సీజ్​చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫిట్​నెస్​లేని, కాలం చెల్లిన స్కూల్​బస్సులు, వ్యాన్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 

ఎందుకు ముందుకు రావట్లేదంటే?

గ్రేటర్​లోని స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి 12,635 బస్సులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 50 శాతం మాత్రమే ఫిట్​నెస్ టెస్టులకు వచ్చాయి. మిగిలిన వాటిలో ఎక్కువ శాతం 15 ఏండ్లకు మించిన వాహనాలు ఉండడంతో ఫిట్​నెస్​పరీక్షలకు రాలేదని అధికారులు గుర్తించారు. అంతేగాక బస్సుల్లో పిల్లల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా స్టూడెంట్లు​సులభంగా ఎక్కి దిగడానికి మెట్లు ఏర్పాటు చేయాలి. 

కిటికీల నుంచి చేతులు, తల బయటకు పెట్టకుండా జాలీలు బిగించాలి. ఫైర్​సేఫ్టీ పరికరాలు, ఫస్ట్​ఎయిడ్ బాక్సులు పెట్టించాలి. వాహనాలకు ఇన్స్యూరెన్స్​ చేయించి ఉండడంతోపాటు ఆర్టీఏకు పన్ను చెల్లించి ఉండాలి. డ్రైవర్ కచ్చితంగా 60 ఏండ్ల లోపు వారై ఉండాలి. ఈ నిబంధనలేవీ పాటించని యాజమాన్యాలు ఫిట్​నెస్​ పరీక్షలకు వస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో రావడం లేదని తెలుసుకున్నారు.

అధికారులు ఏం చేస్తున్నట్టు? 

ఫిట్​నెస్​ పరీక్షలకు రాని స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైలెన్స్​గా ఉంటున్నారు. అప్పుడప్పుడు తనిఖీలు చేసినప్పుడు లోపాలు బయటపడితే కేవలం జరిమానాలతో సరిపెడుతున్నారు. 15 ఏండ్లు దాటిన స్కూల్, కాలేజీ బస్సులను, వ్యాన్లను తప్పనిసరిగా స్క్రాప్​ చేయాల్సిందే.

ALSO READ : కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది

అయినా, విద్యా సంవత్సరం ప్రారంభంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారు గానీ, పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు. స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు ఫిట్​నెస్ ​పరీక్షలకు బస్సులను తీసుకురాకుండా మ్యానేజ్​ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంత్రి ఆదేశించినట్టు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.