స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా

స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా
  •     ఫిట్​నెస్ లేని 46  బస్సులపై కేసులు నమోదు 
  •     ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్  

హైదరాబాద్/గండిపేట, వెలుగు:  రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 46 బస్సులపై కేసులు నమోదు చేశారు.  రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉండగా, 8 వేల బస్సులు మాత్రమే ఫిట్ నెస్ పొందినట్లు గుర్తించారు. దీంతో బుధవారం ఆర్టీఏ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్​సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్​నెస్, పొల్యూషన్, అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు డ్రైవర్ లైసెన్స్​లను చెక్ చేశారు. 

ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిట్ నెస్ లేని,15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిప్పరాదని హెచ్చరించారు. ఎక్స్ పీరియన్స్ ఉన్న, 60 ఏండ్లు మించని డ్రైవర్లను నియమించుకోవాలని, డ్రైవర్లకు రెగ్యులర్ గా హెల్త్ చెకప్​లు చేయించాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు సూచించారు. 

తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి స్కూల్ బస్సు తప్పనిసరిగా సంబంధిత ఆర్టీఏ ఆఫీసులో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. ఆటో రిక్షా, స్కూల్ వ్యాన్ లలో పరిమితికి మించి స్టూడెంట్లను తీసుకెళ్తున్నారని, దీనిపై పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తనిఖీల్లో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.