ఆర్టీసీ అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ కేసులో గో రూరల్‌‌ ఆస్తులు జప్తు

ఆర్టీసీ అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ కేసులో గో రూరల్‌‌ ఆస్తులు జప్తు
  • బస్సులపై యాడ్స్‌‌ కోసం కాంట్రాక్ట్‌‌ తీసుకొని నిధులు మళ్లించిన సంస్థ
  • ఆర్టీసీకి రూ.21.72 కోట్లు నష్టం.. పోలీసులకు ఫిర్యాదు 
  • గో రూరల్‌‌కు చెందిన రూ.6.47 కోట్లు విలువైన ఆస్తులు సీజ్‌‌ చేసిన ఈడీ

హైదరాబాద్‌‌, వెలుగు: అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ కాంట్రాక్ట్‌‌ పేరుతో తెలంగాణ ఆర్టీసీని మోసం చేసిన గో రూరల్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన రూ.6.47 కోట్లు విలువైన ఆస్తులను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) జప్తు చేసింది. ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన నిధులు సంస్థకు చెల్లించకుండా మోసం చేసినట్లు గుర్తించింది. 

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్‌‌ యాక్ట్ కింద ఆస్తులను సీజ్‌‌ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్‌‌ ఈడీ కార్యాలయం శుక్రవారం వివరాలు వెల్లడించింది. ఖమ్మంకు చెందిన సుశీల్‌‌కుమార్‌‌‌‌ ఐదేండ్ల క్రితం ఆర్టీసీ బస్సులపై అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ కోసం కాంట్రాక్ట్‌‌ తీసుకున్నాడు. తన ఏజెన్సీ గో రూరల్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, ఆర్టీసీ మధ్య ఒప్పందం చేసుకున్నాడు. హైదరాబాద్‌‌, సికింద్రాబాద్ రీజియన్స్‌‌కు చెందిన బస్సులు, ఇతర ఆర్టీసీ ప్రాపర్టీస్‌‌పై వివిధ కంపెనీలతో ప్రకటనలు తీసుకున్నాడు. 

ఒప్పందం ప్రకారం గో రూరల్‌‌ (జీఆర్‌‌‌‌ఐపీఎల్‌‌) సంస్థ మాత్రమే ప్రకటనలు ఇవ్వాలి. ప్రకటనల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించాలి. కానీ కాంట్రాక్ట్‌‌ నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్‌‌ టౌన్‌‌ ఇండియా, గో ట్రాన్సిట్‌‌ మీడియా, లైమ్‌‌ లైట్‌‌ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర సంస్థల ద్వారా గో రూరల్ ఏజెన్సీ వాణిజ్య ప్రకటనలను నిర్వహించింది. ఇలా వచ్చిన నిధులతో సొంత రుణాల చెల్లింపులు, ఆభరణాలు, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలు సహా ఇతర వ్యక్తిగత ఖర్చులకు ఆ సంస్థ వినియోగించింది.

గత ఫిబ్రవరిలో సుశీల్ అరెస్ట్‌‌.. 

అగ్రిమెంట్‌‌ ప్రకారం గో రూరల్‌‌ చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకపోవడంతో ఆర్టీసీకి రూ. 21.72 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై టీజీఆర్టీసీ సికింద్రాబాద్, హైదరాబాద్ రీజినల్‌‌ అధికారులు 2023లో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై సీసీఎస్ పోలీసులు రెండు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో గో రూరల్‌‌ సంస్థ ఎండీ సుశీల్‌‌ కుమార్‌‌‌‌ను అరెస్ట్‌‌ చేసి, కేసు నమోదు చేశారు. 

దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు ఆర్టీసీ ప్రకటనలు ఇవ్వడం ద్వారా సంపాదించిన నిధులను మళ్లించారని గుర్తించింది. దీంతో గో రూరల్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన ఆస్తులను జప్తు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ అధికారులు వెల్లడించారు.