రన్నింగ్​లో విరిగిన ఆర్టీసీ బస్సు టైర్ రాడ్

  • డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

కాగజ్ నగర్, వెలుగు: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీల్ రాడ్డు విరగ్గా.. డ్రైవర్​చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కర్జెల్లి, గూడెం రూట్​లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆసిఫాబాద్ డిపోకి చెందిన ఓ ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని అహెరికి వెళ్లి తిరిగి 55 మంది ప్రయాణికులతో వస్తుండగా కర్జవెళ్లి దాటిన తర్వాత బస్ స్టీరింగ్​కు అనుసంధానంగా ఉండే వీల్ రాడ్డు ఒక్కసారిగా విరిగిపోయింది.

దీంతో బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ ప్రభాకర్ చాకచక్యంతో బస్సును కంట్రోల్ చేసి రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పాడైపోయిన పాత బస్సులను నడిపిస్తున్నారని, ఆర్టీసీ అధికారులు కండిషన్​లో ఉన్నవాటిని నడిపించాలని గ్రామాల ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.