ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు వంద అడుగుల లోయలో పడింది. చెట్టు కొమ్మను తప్పించబోయి అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోండగా.. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. వంద అడుగుల లోతు కావడంతో గాయపడ్డ వారిని పైకి తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఘాట్‌రోడ్డు కావడం అందునా ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం ప్రమాదానికి ముఖ్య కారణమని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.