తాటి చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

  •    హనుమకొండ హసన్‍పర్తి శివారులో ఘటన
  •     20 మందికి గాయాలు.. బాధితుల్లో నిండు గర్భిణి 
  •     ఎదురుగా రాంగ్​ రూట్​లో వచ్చిన లారీ 
  •     తప్పించబోగా ప్రమాదం 

హసన్‍పర్తి, వెలుగు : వరంగల్‍ నుంచి కరీంనగర్‍ వెళ్తున్న ఆర్టీసీ బస్సు హనుమకొండ హసన్‍పర్తి మండల కేంద్రంలో తాటిచెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఓ నిండు గర్భిణి సైతం ఉంది. పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. కరీంనగర్‍ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం వరంగల్‍ నుంచి 50 మంది ప్యాసింజర్లతో బయలుదేరింది. హసన్‍పర్తి జంక్షన్‍ దాటి శివారులోని ఎల్లమ్మగుడి నుంచి వెళ్తుండగా ఎదురుగా మరో వైపు బస్సు వస్తోంది. దాని వెనక ఉన్న లారీ ఆ బస్సును ఓవర్​టేక్ ​చేసే క్రమంలో కుడివైపుకు వచ్చింది.

దీంతో కరీంనగర్​ వెళ్తున్న బస్సుకు దారి లేకుండా పోయింది. యాక్సిడెంట్​ను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్​ బస్సును ఎడమ వైపుకు తిప్పాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు వచ్చి ఫస్ట్ ​ఎయిడ్ ​చేయించి ఎంజీఎంకు తరలించారు. కాగా, తాటిచెట్టు వెనకాల ఐదారు ఫీట్ల లోతుతో లోయ వంటి పెద్ద గుంత ఉంది. ఒకవేళ తాటిచెట్టు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. 

గూడూరులో తప్పిన ప్రమాదం

గూడూరు : మహబూబాద్ జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్  సమీపంలో ఆదివారం ఉద యం ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. భూపాల్ పల్లి డిపోకు చెందిన బస్సు భద్రాచలం వెళ్లొస్తోంది. గూడూరు బస్టాండ్ సమీపంలోకి రాగానే టర్నింగ్​వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. సైడ్ నుంచి ఢీకొట్టింది. గుర్తించి బ్రేక్​ వేయడంతో పెద్ద ముప్పు తప్పింది. యాక్సిడెంట్​ టైంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.