కారు చీకటి.. చుట్టూ వరద.. 12 గంటల నరక యాతన

కారు చీకటి.. చుట్టూ వరద.. 12 గంటల నరక యాతన
  • వరంగల్ జిల్లాలో కాజ్ వేపై వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
  • రాత్రంతా వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన 50 మంది
  • సాహసం చేసి ప్రయాణికులందరిని కాపాడిన లారీ డ్రైవర్

నెక్కొండ(వరంగల్), వెలుగు:  వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం సాయంత్రం 4.30 గంటలకు దాదాపు 50 మంది భక్తులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు వరద ఉధృతిలో చిక్కుకున్నది. రాత్రంతా ప్రయాణికులు బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడపగా.. తెల్లారిన తర్వాత అధికారులు లారీ సాయంతో వారిని కాపాడి తీసుకొచ్చారు.

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. శనివారం సాయంత్రం 9.30 గంటలకు మొదటి కాజ్ వేపై వరదను దాటుకుని వెళ్లిన బస్సు.. మరికొద్ది సేపటికి వెంకటాపురం శివారులో రెండో కాజ్ వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో నిలిచిపోయింది. ముందుకు, వెనక్కి పోలేని స్థితిలో డ్రైవర్ బస్సును ఆపేశాడు. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు ఆదుకోవాలంటూ అధికారులను, కుటుంబ సభ్యులను ఫోన్ లో వేడుకున్నారు.

రాత్రి 11 గంటలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ వరద ఉధృతి పెరగడంతో ఏమీ చేయలేకపోయారు. దీంతో దాదాపు 45 నుంచి 50 మంది ప్రయాణికులు12 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం ఉదయం రెస్క్యూ, రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి, ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

కి.మీ. రివర్స్ డ్రైవ్ చేసిన లారీ డ్రైవర్... 

కాజ్​వేపై వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో బస్సు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. చివరగా.. ఓ లారీ డ్రైవర్ ధైర్యం చేశాడు. ఇటుక లోడ్ ఉన్న లారీతో వరదను దాటి బస్సు వద్దకు వెళ్లాడు. ప్రయాణికులందరినీ లారీలో ఎక్కించుకున్నాడు. అంతకుముందు లారీ ఉన్న ప్రాంతంలో కనీసం వాహనాన్ని వెనక్కు తిప్పుకోలేని పరిస్థితి ఉండటంతో.. దాదాపు కిలోమీటర్ దూరం డ్రైవర్ లారీని రివర్స్ గేరులోనే సాహసోపేతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు.

చివరకు లారీని సురక్షితంగా కాజ్ వే దాటించాడు. సాహసం చేసి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్​ను కలెక్టర్ సత్య శారద అభినందించారు. ప్రయాణికులకు మొదట వెంకటాపూర్ ప్రాథమిక స్కూల్ లో ఆశ్రయం కల్పించారు. అనంతరం నెక్కొండకు తరలించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,  సీపీ అంబర్ కిశోర్ ఝా సహాయక చర్యలను పర్యవేక్షించారు.