బైక్‌‌‌‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. 30 మందికిపైగా గాయాలు

బైక్‌‌‌‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. 30 మందికిపైగా గాయాలు
  • , ఇద్దరి పరిస్థితి విషమం
  • సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ప్రమాదం

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : ఎదురుగా వస్తున్న బైక్‌‌‌‌ను తప్పించబోగా.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తోంది. చింతలపాలెం గ్రామ శివారులోని మూలమలుపు వద్దకు రాగానే ఓ బైక్‌‌‌‌ ఎదురుగా వచ్చింది.

బైక్‌‌‌‌ను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బైక్‌‌‌‌ను ఢీకొట్టడంతో పాటు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. వాహనదారులు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు, యువకులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికిచేరుకొని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిని ఐదు అంబులెన్స్‌‌‌‌ల ద్వారా మేళ్లచెరువు, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, చింతలపాలెంలోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

మరో వైపు బైక్‌‌‌‌పై వచ్చిన మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన బానోతు వెంకటేశ్‌‌‌‌, శివబాలాజీనగర్‌‌‌‌కు చెందిన బాణోతు గోపి, రామాపురం గ్రామానికి చెందిన బనగాల కోటిలింగంకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో వెంకటేశ్‌‌‌‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. మిగతా ఇద్దరిని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు.