కర్ణాటకలో చోరీ అయిన బస్సు తాండూరులో గుర్తింపు

సాధారణంగా పార్కింగ్ చేసి ఉన్న బైకులు, ఆటోలను చోరీ చేయడం వంటి ఘటనలు వినే ఉంటాం. కాని కర్ణాటకలో ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. బస్టాండ్‭లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కర్ణాటకలో చోరీ అయిన ఈ బస్సును తెలంగాణ సరిహద్దులోని తాండూరులో గుర్తించారు. కర్ణాటక, తాండూరు పోలీసుల సహాకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చించొల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న AK38F971 నెంబర్‌ గల బస్సును మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది గుల్బర్గా డీసీ వీరేష్‌‭తో పాటు.. చించొల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు పోలీసుల సహాకారం కోరారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. తాండూరు మండలంలోని భూ కైలాస్‌ వద్ద చోరీ అయిన బస్సును గుర్తించారు. వెంటనే కర్ణాటక, తాండూరు పోలీసులతో పాటు.. డీసీ, సిబ్బంది భూకైలాస్ వద్దకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 గంటల్లోనే పోలీసులు, అధికారులు బస్సు ఆచూకీని కనిపెట్టారు. మరోవైపు బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చోరీ అయిన బస్సును గుర్తించడంలో సహకరించిన కర్ణాటక పోలీసులతో పాటు.. తాండూరు పోలీస్ స్టేషన్‭కు చెందిన పోలీసు సిబ్బంది శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.