కల్వకుర్తి, వెలుగు: నాగర్కర్నూల్జిల్లాలోని కల్వకుర్తి మండలం రఘుపతి పేట వద్ద ప్రవహిస్తున్న దుందుబి వాగులో మంగళవారం ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. స్థానికుల కథనం ప్రకారం..నాలుగు రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రఘుపతిపేట వద్ద ఉన్న దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తెల్కపల్లి నుంచి కల్వకుర్తికి 30 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. రఘుపతిపేట దగ్గర వాగు వద్దకు వచ్చేసరికి ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయని డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు.
మధ్యలోకి వెళ్లగానే నీటి ప్రవాహం మరింత పెరిగింది. అంతకుముందే రోడ్డుపై గుంతలు ఉండడంతో ఆ గుంతలో బస్సు చిక్కుకున్నది. దీంతో ఎటూ కదలలేక పోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడ్డారు. వెంటనే బస్సు డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చేలోపు గ్రామస్థులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను కిందకు దింపి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కల్వకుర్తి పోలీసులు జేసీబీని రప్పించి బస్సును బయటికి తెప్పించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత రాకపోకలను నిషేధించారు.