- మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే పున: ప్రారంభం
ములుగు, వెలుగు : పదేండ్ల కింద మంత్రి సీతక్క ఊరికి బందైన ఆర్టీసీ బస్సును మళ్లీ ఆమె ప్రమాణ స్వీకారం చేసిన గురువారం నుంచి పునరుద్ధరించారు. ములుగు మండలం జగ్గన్నపేట మంత్రి సీతక్క సొంతూరు కాగా, ములుగు నుంచి మాధవరావుపల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, చిన్నగుంటూరుపల్లి, పత్తిపల్లి గ్రామాల మీదుగా పొట్లాపూర్ వరకు సుమారు 12కిలోమీటర్ల మేర ఆర్టీసీ సేవలను తిరిగి ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు ట్రిప్పులు నడిపించనున్నామని ఆఫీసర్లు చెప్పారు.
పదేండ్ల కింద రోడ్డు బాగాలేకపోవడంతో పాటు ప్రయాణికులు ఎక్కడం లేదని బస్సు సర్వీసు రద్దు చేశారు. తిరిగి బస్సు నడిపించాలని గతంలో పలుమార్లు ఆఫీసర్లకు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆ గ్రామాల్లో ప్రజలు ప్రైవేటు వాహనాలు, టూ వీలర్లను ఆశ్రయించేవారు. మంత్రి సీతక్క అధికారికంగా బుధవారం బాధ్యతలు స్వీకరించడంతో బస్సును పునరుద్ధరించడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.