- ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు
- పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ‘జెంట్స్ స్పెషల్’ పేరుతో బస్ నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం ‘పురుషులకు మాత్రమే’ పేరుతో బస్సు నడిపారు. కాలేజీ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్ బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్ లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటున్నది. ఫుట్ బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు.
ఈ రద్దీని తగ్గించేందుకు అధికారులు ‘జెంట్స్ స్పెషల్’ బస్సు నడిపారు. అయితే దీనిపై మహిళలు అభ్యంతరం చెప్పడంతో ఒక్క ట్రిప్ నడిపిన తర్వాత బస్సును ఆపేశారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ‘జెంట్స్ స్పెషల్’పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాంటి బస్సులు నడపాలని ఆదేశాలేవీ లేవన్నారు. అనుమతి తీసుకోకుండానే బస్సు ఎలా నడుపుతారని డిపో మేనేజర్ పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అది పాత ఫోటో అని, ‘జెంట్స్ స్పెషల్’ బస్సు నడపలేదని డిపో అధికారులు మాట మార్చారు.
హైదరాబాద్ లో మహిళలు, విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని రూట్ల లో ఇప్పటికే ‘లేడీస్ స్పెషల్’ బస్సులు నడుపుతున్నారు. వీటి సంఖ్య పెంచాలని ప్రపోజల్స్ వస్తున్నా, బస్సుల కొరత కారణంగా ఆర్టీసీ పెంచడం లేదు. త్వరలో కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో వీటి సంఖ్య పెంచాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది.