- 25 మంది ప్రయాణికులకు గాయాలు
బూర్గంపహాడ్,వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోతె శివారులో ఆదివారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయింది. ఈక్రమంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి మెయిన్రోడ్పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 38మంది ప్రయాణికులుండగా 25 మంది గాయపడ్డారు. వీరిని స్థానికులు వెంటనే భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని భద్రాచలం ఆర్టీసీ డీఎం రామారావు పరామర్శించారు. ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు.