సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన జనాలను ఇబ్బందుల్లో పడేసింది. ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభ కోసం కేటాయించడంతో బస్సుల్లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లో ఒక్క బస్సు కూడా లేకపోవడంతో స్టూడెంట్స్, ఉద్యోగులు, గమ్యస్థానాలకు వెళ్లేందుకు జనం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్ లో ఎదురు చూస్తున్నా బస్సులు రాకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. కరీంనగర్ రీజియన్ లోని సగం బస్సులను జగిత్యాల సభ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులను సైతం సీఎం సభ కోసం వినియోగిస్తున్నారని సమాచారం.
సీఎం సభకు జన సమీకరణ కోసం టీఆర్ఎస్ నాయకులు గ్రామగ్రామానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి బస్సు వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంతలో పడింది. ఈ ఘటనలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కు ఎలాంటి గాయాలు తగలలేదు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉంటే సీఎం టూర్ సందర్భంగా నిన్నటి నుంచే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.