- ఆర్డర్ ను బట్టి టూ, త్రీ, ఫోర్ వీలర్ల వినియోగం
- మొదట సిటీలో తర్వాత జిల్లాల్లో విస్తరణ.
హైదరాబాద్, వెలుగు: ఇంటింటికి కార్గో సేవలను అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక బస్సు స్టేషన్ నుంచి మరో బస్సు స్టేషన్ వరకే సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే బుక్ చేసుకోవాలన్నా, డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్నా సమీపంలోని బస్సు స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఇప్పుడు ఇక వినియోగదారులకు ఆ బాధ తప్పనుంది. ఇంటికే నేరుగా తమ సేవలను అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది.
ఈ కామర్స్ కు ధీటుగా.. ఏదైనా సరే ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి ఆ వస్తువును తీసుకెళ్లడం..ఆ తర్వాత చెప్పిన అడ్రస్ కు డెలివరీ చేయనుంది. బుక్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ను రూపొందించారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్లను వినియోగించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సిటీలో ప్రయోగాత్మకంగా అమలు
ఇంటింటికి కార్గో సేవలను మొదట హైదరాబాద్ సిటీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాలకు విస్తరించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండడంతో ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సంస్థ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్షలో సూచించారు. దీంతో కార్గో సేవల ద్వారా ఆర్టీసీ సరికొత్త ఆదాయ మార్గాలను ఎంచుకుంది. ప్రస్తుతం సంస్థలో కొన్ని పాత బస్సులను స్క్రాప్ గా మార్చలేక..కార్గో సేవలకు వినియోగిస్తున్నారు. ఇక నుంచి డీజిల్ బస్సులు అన్నింటినీ కార్గో సేవలకే కేటాయించనున్నారు. ఎలక్ట్రానిక్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.