ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్

  • ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగినయ్
  • ప్యాసెంజర్ సెస్ పేరుతో రూ.5 బాదుడు 
  • రౌండ్ ఫిగర్ పేరిట మరో రూ. 5 పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనార్  
  • చార్జీలు రూ. 5 నుంచి రూ. 14 వరకూ పెరిగే చాన్స్   

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ చార్జీలు మళ్లీ పెరిగాయి. మొదట పల్లె వెలుగు బస్సుల్లో రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ అని, ఆ తర్వాత సేఫ్టీ సెస్‌‌‌‌‌‌‌‌ అని చార్జీలు పెంచారు. రెండు రోజుల క్రితం వివిధ రకాల బస్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ ధరలనూ భారీగానే పెంచారు. ఇప్పుడు మళ్లీ ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ పేరుతో మరో బాదుడుకు రంగం సిద్ధమైంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, డీలక్స్‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో ప్రతి ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌పైనా రూ. 5 కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. మళ్లీ రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ పేరుతోనూ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న టికెట్‌‌‌‌‌‌‌‌ ధరకు ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ రూ. 5 యాడ్‌‌‌‌‌‌‌‌ చేసి, తర్వాత మరో రూ. 5 పెరిగేలా రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఉదాహరణకు.. ఏదైనా ఒక రూట్‌‌‌‌‌‌‌‌కు టికెట్‌‌‌‌‌‌‌‌ చార్జీ రూ. 56 ఉంటే, ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ రూ. 5తో కలిపి మొత్తం రూ. 61 అవుతుంది. అయితే ఆఖరిగా దాన్ని రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ పేరుతో రూ. 65 చేస్తారు. అంటే ఒక టికెట్‌‌‌‌‌‌‌‌పై రూ. 9 పెరుగుతుంది.

లగ్జరీ బస్సుల్లో ఇయ్యాల్టి నుంచే.. 
సూపర్‌‌‌‌‌‌‌‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో రూ. 5 సెస్‌‌‌‌‌‌‌‌ వసూలు చేయనుండగా, రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ మాత్రం రూ. 10 వచ్చేలా చేశారు. టికెట్‌‌‌‌‌‌‌‌ ధర రూ. 56 ఉంటే రూ. 5 సెస్‌‌‌‌‌‌‌‌తో కలిపి 61 అవుతుంది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ పేరుతో 70 చేస్తారు. అంటే టికెట్‌‌‌‌‌‌‌‌పై రూ. 14 పెరుగుతుంది. ఎక్స్ ప్రెస్, లగ్జరీ బస్సుల్లో సెస్‌‌‌‌‌‌‌‌, రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులకు సౌలతులు ఏర్పాటు చేసేందుకు 2013లో ఒక రూపాయి ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ పెంచుకునేందుకు సర్కారు అనుమతిచ్చింది. దాన్ని ఇప్పుడు రూ. 5కి పెంచారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన అసలు ప్రతిపాదలు సర్కారు వద్దే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 30 శాతం వరకు చార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇస్తే ప్రయాణికులకు మరో భారీ బాదుడు తప్పదు.