చార్జీల నయా థియరీ : బరాబర్ పెంచుడే!

చార్జీలు ఏ రూపంలో పెరిగినా సామాన్య జనంపై వాటి ప్రభావం పడటం ఖాయం. కొన్నిసార్లు చార్జీల పెంపు డైరెక్టుగా ఉంటే మరికొన్ని సార్లు ఇన్ డైరెక్ట్ గా
ఉంటుంది. ఎలా ఉన్నా నలిగిపోయేది ప్రజలే. అందుకే చార్జీలు కానీ పన్నులు కానీ పెంచాలంటే ప్రభుత్వాలు వెనకాముందు ఆడుతుంటాయి. ఎన్నికలు జరిగే టైమ్ లో వాటి జోలికి పోవు. కష్టమో, నష్టమో సర్కార్లే భరిస్తాయి. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసి, ప్రజలు ఎలా ఫీలైనా పర్లేదనుకున్నప్పుడు ప్రభుత్వాలు విజృంభిస్తాయి. అదను చూసి పెంచుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా సార్లు ఆర్టీసీ,కరెంటు చార్జీలు పెరిగాయి. అలా పెరిగాయో లేవో ఇలా రాష్ట్రమంతటా ధర్నాలు, ఆందోళనలు జరిగేవి. అన్ని ప్రాంతా ల్లో నిరసనలు వ్యక్తమయ్యేవి. చంద్రబాబు హయాంలో ఓసారి కరెంటు చార్జీలు పెరిగితే కాల్పుల దాకా (బషీర్ బాగ్ )నిరసనలు వెళ్లాయి. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ రక్తపు మరకగా మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ‘చార్జీల పెంపు’ నిర్వచనమే మారిపోయింది. చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందనేదానికి కారణాలు చెబుతూ ప్రభుత్వం తనకు తాను జస్టిఫై చేసుకునే తీరు వచ్చింది. చార్జీలు పెంచకపోతే నష్టపోయేది ప్రజలే అనే వాదన కొత్తగా తెరమీదకు వచ్చింది. ఈ కాన్సెప్ట్ తో అందరినీ మెప్పించి, ఒప్పించే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టమైంది.

కరోనాయే హైలెట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇష్యూనే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైలెట్ అయింది. బడ్జెట్, పద్దులపై చర్చలు ఇవన్నీ పక్కకు పోయాయి. బడ్జెట్ సమావేశాలంటే కనీసం 14 రోజులు నిర్వహించాలనే పాత పద్ధతులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మార్చేసింది. కరోనా ఎఫెక్ట్ తో కేవలం వారం రోజుల్లోనే ఈసారి బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం అర్థాంతరంగా ముగించింది. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో పాటు పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) కు సంబంధించి తీర్మానం చేయడం, గతంలో అమలైన అభయహస్తం స్కీంను రద్దు చేయడం ఈసారి సమావేశాల్లో చర్చకు తెరలేపిన అంశాలు. వీటన్నిటినీ మించిన కీలకమైన అంశం చార్జీల పెంపు ! ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరెంటు చార్జీలు పెంచుతామన్నారు. పెంచడం తప్పదని తేల్చి చెప్పారు. అవసరమైతే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచుతామన్నారు.

వీటితోపాటు గ్రామాల్లో ఆస్తి పన్ను, లిక్కర్ రేటు కూడా పెంచుతామన్నా రు. ఇలా ఒక్కో సమయంలో ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ మొత్తానికి చార్జీల పెంపు ఖాయమనే సంకేతాలిచ్చారు. అసెంబ్లీ వేదికగా చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం వెనక ఒక వ్యూహం ఉందన్న అభిప్రాయం వినపడుతోంది. పెంపునకు అందరి ఆమోదం ఉందన్న సంకేతాలు బయటి ప్రపంచానికి పంపడమే వ్యూహమంటున్నారు ఎనలిస్టులు. దీంతో కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచితే సహజంగా విమర్శలకు దిగే ప్రతిపక్షాల గొంతుకు ప్రభుత్వమే ముందుగా అడ్డుకట్ట వేసినట్లయింది. అంతేకాదు ఆయా సంస్థల మనుగడ కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీలు బాజాప్తా పెంచుతామని అసెంబ్లీలో వెల్లడించారు. “చార్జీలు పెంచుతాం …భరిం చాలి….మోసం చేయం…వెనక్కి వెళ్లం …నటిం చం ”అంటూ పెంపుపై తేల్చి చెప్పారు. ఇదే కేసీఆర్ ప్రకటించిన నయా చార్జీల ధియరీ.

రెండో విడత ఆర్టీసీ చార్జీల మోత

ఈమధ్య జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తరువాత రాష్ట్రంలో 20 శాతం మేర బస్సు చార్జీలు పెరిగాయి. దీంతో నష్టాల రూట్లో ఉన్న ఆర్టీసీకి రోజుకు రూ. కోటి నుంచి కోటిన్నర వరకు అదనపు రాబడి వచ్చింది. ఈ పరిస్థితు ల్లో రెండో విడత బస్సు చార్జీల వడ్డిం పునకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈసారి చార్జీల పెంపు పదిశాతం వరకు ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నా యి. దీంతో రోజుకు రూ. 80 లక్షల మేర రాబడి పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. సర్కార్ కు రాబడి పెరిగే సంగతి ఎలాగున్నా ప్రయాణీకులపై భారం తప్పని పరిస్థితి. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిం చడానికి చార్జీలను ప్రతి ఏడాది సవరించాలనే ప్రతిపాదనపై సమ్మె సమయంలో చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లోనే చార్జీల పెంపునకు ప్రభుత్వం రెడీ అయినట్లు కనపడుతోంది.

ఆర్టీఏలో 10శాతం ఛార్జీల పెంపు..

రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్రధాన శాఖల్లో ఆర్టీఏ ఒకటి. ఈ శాఖ నుంచి ఏటా రూ. 3,250 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకు రాబడి వస్తోంది. వెహికిల్ లైసెన్స్‌‌, బండ్ల రిజిస్ట్రేషన్‌‌, ట్యాక్స్‌‌లు, సర్వీసు ఛార్జీలు, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ తదితర మార్గాల్లో ఈ రాబడి వస్తోంది. ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం రాబడి వృద్ధి ఉంటుంది. ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాబడి పెరగలేదు. దీంతో అదనపు రాబడి కోసం ఆర్టీఏ సర్వీసు ఛార్జీలన్నీ పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. త్వరలోనే ఆర్టీఏలో వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్‌‌తో పాటు మొత్తంగా 56 సేవల ఛార్జీలను పెంచబోతోంది. ప్రస్తుతం ఉన్న ధరలపై పది శాతం మేరకు పెంపు తప్పదని అధికారులు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 4,300 కోట్లు ఆర్టీఏకు టార్గెట్ గా సర్కార్ విధించింది. అంటే దాదాపు వెయ్యి కోట్ల మేరకు వాహనదారులపై వడ్డన తప్పదని అర్థమవుతోంది.                                                              –బొల్గం శ్రీనివాస్, వెలుగు బ్యూరో చీఫ్