- మహిళా స్టాఫ్కు అర్థరాత్రి వరకు విధులు
- సెలవులు ఇవ్వడం లేదని చెబుతున్న కార్మికులు
- యూనియన్లు కావాలంటున్న ఉద్యోగులు
ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఒక మహిళా కండక్టర్ సొంత కూతురు ఫంక్షన్ కోసం 10 రోజులు సెలవు కావాలని అడిగారు. మూడ్రోజులకు మించి సెలవు కుదరదని ఆఫీసర్లు ఆమెకు తేల్చి చెప్పారు. తల్లిగా కుమార్తె పట్ల తన బాధ్యత నిర్వర్తించలేక ఆ కండక్టర్ తన కొలీగ్స్ దగ్గర బాధ పడ్డారు. బంధువులను ఇంటికి పిలిపించుకొని తను డ్యూటీకి హాజరైంది. రెగ్యులర్ గా 10 నుంచి 12 గంటలకు పైగా డ్యూటీ చేస్తున్నా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు ఇవ్వకపోతే ఎలా అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఖమ్మం, వెలుగు : ఖమ్మం రీజియన్లో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. తమతో రోజూ ఎక్కువ పనిచేయిస్తూ వేధింపులకు గురి చేయిస్తున్నారని చెబుతున్నారు. మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్(ఎంటీడబ్ల్యూ) యాక్ట్ ప్రకారమే డ్యూటీలు చేయిస్తున్నామని ఆఫీసర్లు అంటున్నా, కార్మికులు మాత్రం కాదంటున్నారు. ఒక్కోసారి 12 నుంచి 13 గంటలు పనిచేసినా కూడా స్టీరింగ్ అవర్స్ తక్కువ చూపించి 8 గంటలుగానే లెక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రోజూ తమను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారని కొందరు మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. డ్యూటీలు ఉన్నా.. లేకపోయినా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతున్నారని, స్పేర్ లో పెడితే ఆన్ డ్యూటీ కింద పరిగణించాల్సి ఉండగా అలా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో మొత్తం 2,400 మంది వరకు ఉద్యోగులున్నారు.
ఇందులో దాదాపు 1100 మంది కండక్టర్లు కాగా, మరో 900 మంది డ్రైవర్లున్నారు. మిగతావారిలో క్లరికల్ స్టాఫ్ తో పాటు డిపోల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో యూనియన్లను నిషేధించగా, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా యూనియన్లను మళ్లీ యాక్టివ్ చేయాలని కోరుతున్నారు.
ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్న సమస్యల్లో కొన్ని..
- బస్సుల రూట్ వైజ్ గా కిలోమీటర్లను అడ్డగోలుగా పెంచుతున్నారు. కిలోమీటర్లు తిప్పితే ఎర్నింగ్ అదే వస్తుందని చెబుతున్నారు. కానీ దానికి తగ్గ ఆదాయం రావడం లేదు. డబ్బులు తేవడం లేదని కండక్టర్లను వేధిస్తున్నారు.
- 55 ఏళ్ల వయస్సు ఉన్న డ్రైవర్లకు పల్లె వెలుగు బస్సుకు మాత్రమే డ్యూటీలు వేయాలని నిబంధన ఉంది. కానీ ఏసీ, ఇంద్ర బస్సుల్లో డ్యూటీలు వేస్తున్నారు. లేదంటే వేరే డిపోలకు, వేరే రీజియన్లకు బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారు.
- అధిక డ్యూటీలు వేసిన క్రమంలో అనుకోకుండా బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. డ్రైవర్ పై 304ఎ కేసు నమోదయితే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నారు.
- నిబంధన మేరకు ప్రమాదంలో బస్ బాడీ ఎంత డ్యామేజ్ అయినా రూ.వెయ్యికి మించి ఫైన్ వేయకూడదు. కానీ రూ.లక్షల కొద్దీ డ్రైవర్ పై జరిమానా విధిస్తున్నారు. ఇంక్రిమెంట్లను పోస్టుపోన్ చేస్తూ వేధిస్తున్నారు.
- ఆరోగ్యం బాగోలేదని కార్మికులు సిక్ చేసినా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ యాప్ ద్వారా లీవ్ అప్లై చేసినా రిజెక్ట్ చేయడం తప్ప మంజూరు చేయడం లేదు.
- ఎర్నింగ్స్(క్యాష్) లో ఏడీసీలు నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరిని.. ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరిని నియమించడంతో పని ఒత్తిడి పెరుగుతోంది.
- డిపో నుంచి రూట్ వేయించుకుని నేరుగా వచ్చిన బస్ సర్వీసులను.. బస్టాండ్ కు రాగానే అధికారులు ఏ రూట్ కు వెళ్లమంటే ఆ రూట్ కు వెళ్లాలని, లేకపోతే మస్టర్లు ఇవ్వబోమని అధికారులు వేధిస్తున్నారు. ఇలాంటి నిర్ణయంతో కండక్టర్లు, డ్రైవర్లు మనోవేదనకు గురవుతున్నారు.