ఆర్టీసీ సమ్మె నోటీస్: ఆ రోజు నుంచి బంద్ అంటూ అల్టిమేటం

ఆర్టీసీ సమ్మె నోటీస్: ఆ రోజు నుంచి బంద్ అంటూ అల్టిమేటం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశారు ఆర్టీసీ ఎంప్లాయిస్. ఆర్టీసీ క్రాస్ రోడ్‎లోని బస్ భవన్లో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యలు పరిష్కారించాలంటూ సోమవారం (జనవరి 27) ఆర్టీసీ జేఏసీ నేతలు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‎కు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. తమ సమస్యలు పరిష్కరించకపోతే 2025, ఫిబ్రవరి 9న సమ్మె బాట పడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 

సమ్మె నోటీసు అందజేత సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు,  కార్మిక జేఏసీ నేతలు పెద్ద ఎత్తున బస్ భవన్‎కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ నేతలు మాట్లాడుతూ.. నెలల పాటు పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మొత్తం 21 డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైన ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | ఆర్టీసీలో సమ్మె.. 27న నోటీస్ ఇవ్వాలని నిర్ణయం

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతుందని.. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళనను వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో విలీనం, 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కరించలేదని.. ప్రభుత్వం వాటిపై దృష్టి సారించి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ.