
- రెండు నెలలుగా ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ బకాయిలు
- 600 కోట్లు పెండింగ్ పడడంతో జీతాల చెల్లింపునకు ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం బకాయిలు చెల్లించడం లేదు. దీంతో రూ. 600 కోట్లు పెండింగ్ పెట్టడంతో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని సంస్థ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నెల పదో తారీఖు దాటినా ఇంకా చాలా మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. 2022లో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడంపై దృష్టిపెట్టి సక్సెస్ అయ్యారు.
దాదాపు రెండున్నరేండ్లుగా ప్రతినెలా ఫస్ట్ కు జీతాలు అందుకున్న ఆర్టీసీ ఉద్యోగులు... ఈ నెల మాత్రం పదో తారీఖు దాటినా సగానికిపైగా ఉద్యోగులకు జీతాలు అందలేదు. నిజానికి ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ఆదుకుంది. మహాలక్ష్మి స్కీం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణించే మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ప్రతినెలా రూ.300 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు సక్రమంగానే చెల్లిస్తూ వచ్చిన ప్రభుత్వం గడిచిన రెండు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ ఆర్టీసీకి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఈ నెల ఉద్యోగులను కేటగిరీలుగా విభజించి, విడతల వారిగా జీతాలు అందజేస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ తారీఖు పోయి పదిరోజులు దాటినా ఇంకా చాలామంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.