
- సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఐఎన్‌టీయూసీ ఎస్ డబ్ల్యూఎస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చించకపోవడం దురదృష్టకరమని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సిటీలోని పలు ఆర్టీసీ డిపోల్లో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ను గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎస్‌డబ్ల్యూఎస్ కీలకంగా పనిచేసిందని, అయినా ఈ సంఘాన్ని ఇప్పుడు ప్రభుత్వం విస్మరించడం విచారకరమని తెలిపారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చులేని కార్మిక సంఘాలను పునరుద్ధరించడంలో ఐఎన్ టీయూసీ ఎస్ డబ్ల్యూఎస్ విఫలమైందనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేత కె. కెశవరావు, జి. చిన్నారెడ్డిలను కలిసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.