రద్దీ రూట్లపై ఆర్టీసీ దృష్టి

  • ప్రయాణికుల ఇబ్బందులు తప్పించేందుకు అదనపు బస్సులు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రద్దీ రూట్లపై ఆర్టీసీ ఫోకస్​ పెట్టింది. ప్రధాన రూట్లలో రద్దీ ఎక్కడుంది? ఏ రోజుల్లో.. ఏ సమయంలో ఎక్కువగా రష్​ ఉంటుంది? ఆ రూట్లలో అదనంగా ఎన్ని బస్సులు తిప్పాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు.  ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా వివరాలు తెలుసుకుంటున్నారు. 

దీనిపై పూర్తి సమాచారం సేకరించి, ఆ తర్వాత ఏయే రూట్లలో అదనపు బస్సులను తిప్పాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.  ఎన్ని   బస్సులు అవసరం, వాటిని ఏ రకంగా సమాకూర్చడం అనేదానిపై చర్చించనున్నారు.

కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితి ఆర్టీసీకి లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన అదనపు బస్సులను తీసుకొని, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో  తిప్పే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నది. దీంతో ఇటు ప్రయాణికుల సమస్యలు తొలిగిపోనుండగా.. అటు ఆర్టీసీకి ఆదాయం పెరుగనున్నది. ప్రధానంగా రైల్వే కనెక్టివిటీ లేని రూట్లలో ప్రజలకు ఆర్టీసీ బస్సులే రవాణాలో కీలకంగా మారాయి.

 ఇలాంటి రూట్లను గుర్తించిన అధికారులు రద్దీని అధిగమించే చర్యలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ లాంటి రూట్లలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులే ఏకైక మార్గంగా మారాయి. ఇలాంటి రూట్లు రాష్ట్రంలో మరిన్ని ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి పెట్టి ఆదాయాన్ని ప్రైవేట్ బస్సులకు వెళ్లకుండా, ఆర్టీసీకి వచ్చేలా యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

హైదరాబాద్​ నగరంలోనూ..

హైదరాబాద్ నగరంలో కూడా ఏయే రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో నగరంలోని  కొన్ని రూట్లలో రద్దీ ఎక్కువగా ఉందని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఆ రూట్లలో అదనపు బస్సులను తిప్పే ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో  రద్దీ బాగా ఉన్న రూట్లలో ఈ బస్సులనే అదనంగా వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తున్నది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కింద మహిళల తరఫున చెల్లించాల్సని రూ. 3 వేల 500 కోట్లు ఆర్టీసీకి చెల్లించడంతో ఆ సంస్థ ఇప్పుడు కొంత వరకు నష్టాలను అధిగమించినట్లయింది. దీంతో ఇప్పుడు రద్దీ రూట్లలో ప్రయాణికుల తిప్పలను తప్పించేందుకు అదనపు బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ వేగంగా చర్యలు ప్రారంభించింది.