- ఈ నెల 10, 11,12, 19, 20వ తేదీల్లో వర్తింపు
- పండుగకు 6,432 స్పెషల్ బస్సులు రెడీ
- మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా అమలు
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే తెలంగాణ, ఆంధ్ర ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల భారం మోపింది. పండుగ సందర్భంగా 6,432 స్పెషల్ బస్సులను వేస్తున్నట్లు గురువారం ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. శుక్రవారం నుంచి ఈ నెల 12 వరకు, మళ్లీ తిరుగు ప్రయాణంలో ఈ నెల 19 నుంచి 20 వరకు నడిపే స్పెషల్ బస్సులలో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
రెగ్యులర్ బస్సులలో మాత్రం ఎప్పటి వలే సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. కేవలం ఈ ఐదు రోజుల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తామని, దీనికి ప్రయాణికులు సహకరించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.
రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.
ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. స్పెషల్ బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం.. ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను ఆర్టీసీ పెంచిందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040- 69440000, 040 -23450033 సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.