లాభనష్టాలతో చూస్తారా?!

‘‘తెలంగాణ  ముఖచిత్రాన్ని మార్చేయడానికి అప్పులు చేస్తే తప్పేంటి? అని చెప్పే ముఖ్యమంత్రి… ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు అప్పులను ఎందుకు బూచిగా చూపిస్తున్నారో స్పష్టం చేయాలి.  ఎందుకు ఆర్టీసీ కార్మికులపట్ల వ్యతిరేకత చూపుతున్నారు? ఆర్టీసీ కార్మికులు  ప్రభుత్వ పథకాలకు ఏమైనా అనర్హులా అనేది  తెలియజేయాలి. ఆర్టీసీ యాక్ట్​-1950 ప్రకారం ఇది పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ సంస్థ. ఆర్టీసీని లాభ నష్టాలతో చూడకూడడు. ఆదాయం వచ్చినా రాకపోయినా  నడపాల్సిందే. ఆర్టీసీ డ్రైవర్ కూతురుగా వారి బాధలు నాకు తెలుసు’’.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, పీఆర్సీ అమలు, కొత్త బస్సుల కొనుగోళ్లు సహా మొత్తం 26 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందుంచారు. గతంలో మారియట్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీసీని పరిరక్షిస్తామని, కార్మికులకు కడుపునిండా అన్నం పెడతామని సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించారు. ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి.. ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపకుండా ఆర్టీసీ కార్మిక లోకాన్ని మభ్యపెడుతూ వస్తున్నారు.

ఆర్టీసీని విలీనం చేసేందుకు అప్పటి ప్రభుత్వం 2013లోనే కమిటీ వేసింది. దీనిపై అధికారులు హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేసి, సానుకూలంగా రిపోర్టు కూడా సమర్పించారు. అయినా కేసీఆర్ మళ్లీ మళ్ళీ కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారు. లోటు బడ్జెట్​తోనున్న ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగలిగినప్పుడు… ధనిక రాష్ట్రమైన తెలంగాణలో చేయడానికి కేసీఆర్ ఎందుకు సంకోచిస్తున్నారు. పైగా ఏపీఎస్ ఆర్టీసీ సంస్ధ మీద రూ.9,600 కోట్ల అప్పులున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ఆదుకోవాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

అయిదేళ్లుగా
ఆదుకున్నదే లేదు

2014లో ఈ ప్రభుత్వం ఏర్పడిన నాడు 56,740మంది కార్మికులుంటే నేడు కార్మికుల సంఖ్య తగ్గింది. అయినా ట్రిప్పులు తగ్గలేదు.  50 శాతం బస్సులు కాలం చెల్లిన బస్సులతోనే 99. 83శాతం బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. బస్సు టైర్ల మన్నికను 1.64 లక్షల కిలోమీటర్ల నుంచి 1.98 కిలోమీటర్లకు పెంచారు. అయినప్పటికీ సంస్థ నష్టాలకు కార్మికులే కారణమని ప్రభుతం తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. వెహికల్​ ట్యాక్స్​ కింద ఆర్టీసీ  2014-–15లో 193. 02 కోట్లు, 2015–-16లో 192.49 కోట్లు, 2016–-17లో 205. 15 కోట్లు, 2018–19లో 236. 18 కోట్లు సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను  చెల్లించడంలోమాత్రం ప్రభుత్వం మొండికేస్తోంది.  2014–-15లో బకాయిలు 528. 31 కోట్లు ఉండగా, ఇచ్చింది కేవలం 118. 79 కోట్లు మాత్రమే. 2015–-16లో 535. 64 కోట్ల బకాయిలుండగా, 102. 50 కోట్లు ఇచ్చింది, అలాగే 2016–-17లో 553. 71 బకాయిలకుగాను ఇచ్చింది కేవలం 27. 50 కోట్లు మాత్రమే. 2017–-18లో 560. 58 బకాయిలుంటే, కంటితుడుపుగా 260 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇలా ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టేందుకు ప్రభుత్వ విధానాలే కారణమని గణాంకాలే కారణమని స్పష్టంగా పేర్కొంటుండగా, సంస్థ నష్టాలకు కార్మికులే కారణమని  ఆరోపణలు చేయిస్తున్నారు.

కార్మికుల కంట్రిబ్యూషన్​ మరిచారా?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సకల జనులో సమ్మెలో పాల్గొని ఉద్యమ వ్యాప్తికి చాలా కృషి చేశారు. 20 రోజులపాటు ఆర్టీసీ సేవలు నిలిపివేసి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా నాటుకుపోయిందో  కార్మికులు నిరూపించారు.  నాడు కార్మికులు ప్రదర్శించిన ఉద్యమ చైతన్యం చరిత్రలో ఎప్పటికీ పదిలమే. కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల త్యాగాలను ప్రశంసింసి, ‘వాళ్ల కాళ్లలో  ముల్లు గుచ్చుకుంటే పంటితో తీయాల’ని సినిమా డైలాగులు దంచేశారు.  అధికారమే ఎజెండాగా అనేక హామీలిచ్చి ఇప్పుడు మాత్రం ఆర్టీసీ కార్మికులపై బురద జల్లుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న అంశాల్లో వేతన సవరణ కూడా ప్రధానమైంది. ఆర్టీసీ కార్మికుల వేతన ఒప్పందం  2017 మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి కొత్త ఒప్పందం అమలులోకి రావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు అసలు ఒప్పందమే లేదు. అడిగినప్పుడల్లా 2,400 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న సంస్థలో మళ్ళీ వేతన ఒప్పందం అడుగుతారా, ఆర్టీసీని నడపాలో , వద్దో కార్మిక సంఘాలే తేల్చుకోవాలని కెసిఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. 2015లో ఎవ్వరు ఇవ్వనివిధంగా 44శాతం ఫిట్మెంట్ ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. కానీ, జీహెచ్ఎంసీ కార్మికులకు 49 శాతం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఇచ్చారు. న్యాయబద్దంగా రావాల్సిన వాటా కోసం అడిగితే చులకన చేయడం, హక్కుల కోసం సమ్మెకు దిగుతామంటే ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించడం ఉద్యమ నాయకుడి లక్షణమేనా?  టీఆరెస్ అనుబంధ కార్మిక సంస్థ టీఎంయూ నేతలు కూడా కేసీఆర్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్​ రావు  అటు ప్రభుత్వానికి చెప్పలేక, ఇటు కార్మికులకు న్యాయం చేయలేక పదవి నుంచి తప్పుకున్నారు.

సమ్మె నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్​ని ఆశ్రయించి జేబులు  గుల్ల చేసుకుంటారని కేసీఆర్ చుట్టూ ఉన్నవారికి  ముందే తెలుసు. అందుకే  ప్రజల దృష్టిలో ఆర్టీసీ కార్మికులను విలన్లు చేసేందుకు ప్రగతి భవన్​లో వ్యూహాలు పన్నుతున్నారు. కార్మికులు విధుల్లోకి చేరకుంటే డిస్మిస్ చేస్తామనడంకూడా అందులో భాగమే. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ప్రభుత్వం పన్నాగం వేసింది.

ఇందిర శోభన్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి