ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ మీటింగ్‌కు పోవద్దు

ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ మీటింగ్‌కు పోవద్దు
  • సంస్థను ఆ పార్టీ నిర్వీర్యం చేసింది: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ఫైర్ అయ్యారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 55 రోజుల సమ్మె చేస్తే 34 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇవన్నీ కార్మికులు మర్చిపోలేదని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు వరంగల్ బీఆర్ఎస్ సభకు రావాలని ఎలా పిలుపిస్తారని టీఎంయూ నేత థామస్ రెడ్డిపై అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో రిక్రూట్‌‌‌‌ మెంట్ చేయలేదని, రెండు పీఆర్సీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఒక పార్టీ కోసం కార్మికులను ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు. ఆర్టీసీ జేఏసీ నుంచి థామస్ రెడ్డిని బహిష్కరించాలని కోరారు. ఈ నెల 28న జేఏసీ మీటింగ్ కు అన్ని ఆర్టీసీ సంఘాలు అటెండ్ కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 ఆర్టీసీని నాశనం చేసిన కేసీఆర్​కు ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలపరని జేఏసీ కో చైర్మన్ హనుమంతు ముదిరాజ్ అన్నారు. బీఆర్ఎస్ ఓటమిలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ బీఆర్ఎస్ మీటింగ్​కు ఆర్టీసీ కార్మికులు వెళ్లొద్దని, బీఆర్ఎస్ కు మద్దతు తెలపవద్దని సూచించారు. జేఏసీలో ఉండి ఇతర యూనియన్లకు చెప్పకుండా బీఆర్ఎస్ మీటింగ్​కు రావాలని థామస్ రెడ్డి ఎలా చెబుతారని మండిపడ్డారు.