సమ్మె నోటీసిచ్చినా జవాబు లేదు చర్చలకు పిలవకుంటే సమ్మెబాట తప్పదు: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్

సమ్మె నోటీసిచ్చినా జవాబు లేదు చర్చలకు పిలవకుంటే సమ్మెబాట తప్పదు: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్

ముషీరాబాద్, వెలుగు: ఎంతో ఆశతో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు కోసం ఎదురుచూస్తున్నారని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ పేర్కొంది. వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియను పూర్తి చేసి, రెండు వేతన సవరణలు అమలు చేయాలని కోరింది. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. శివం రోడ్ లోని ఓ హోటల్​లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఏ రామచంద్ర రెడ్డి, ఎం థామస్ రెడ్డి మాట్లాడారు. కొంతకాలంగా ఆర్టీసీ సంస్థలో కార్మికులపై అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయని తెలిపారు. 

పని ఒత్తిడి వల్ల ఎంతో మంది కార్మికులు విధుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోగా సమ్మె నోటీసు ఇచ్చినా ఎలాంటి సమాధానం లేదని ధ్వజమెత్తారు. తమకు చర్చలకు పిలవాలని లేనిపక్షంలో సమ్మెబాట పడతామని హెచ్చరించారు. యూనియన్ చీఫ్ అడ్వైజర్ బి యాదయ్య, కమలాకర్ గౌడ్ పాల్గొన్నారు.