కండక్టర్ను అకారణంగా తొలగించారన్న ప్రచారంలో వాస్తవంలేదు

కండక్టర్ను అకారణంగా తొలగించారన్న ప్రచారంలో వాస్తవంలేదు

హైదరాబాద్:జనగామ డిపోకు చెందిన ఓ కండక్టర్ను అకరాణంగా విధులనుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారం నిజంకాదన్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. ఓ మహిళా ప్రయాణికురాలిపట్ల కండక్టర్ అమర్యాదగా ప్రవర్థించారని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో విచారణకు ఆదేశించింది. విచారణలో కండక్టర్ మహిళ పట్ల కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

ఆగస్టు  1న ఓ మహిళ, తన తల్లి, ఏడాది కుమారుతో కలిసి హనుమకొండనుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు జనగామ డిపో బస్సు ఎక్కారు. వీరంతా మొదటి వరుసలో ఉన్న మహిళ రిజర్వ్ డ్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో ఈ సీట్లను ఖాళీ చేయాలని కండక్టర్ శంకర్ వారితో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. లేకుంటే బస్సు దిగి వెళ్లిపోవాలని చెప్పారు. తన అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పినా వినకుండా ముగ్గురుని మడికొండ వద్ద బస్సులోంచి దించేశారని రుజువైందని సజ్జనార్ తెలిపారు. 

ALSO READ | రాజేంద్రనగర్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

ఈ విషయాన్ని బాధిత ప్రయాణికురాలి భర్త సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వివరాలతోపాటు బస్సు, డ్రైవర్, కండక్టర్ ల ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది.

వరంగల్ రీజియన్ అధికారులు విచారణ జరిపి మహిళా ప్రయాణికురాలి పట్ల దురుసుగా అమర్యాదగా ప్రవర్తించడం, నిబంధనలకు విరుద్ధంగా బస్సులోంచి వారిని దించినట్టు కండక్టర్ శంకర్ను విధులను తప్పించడం జరిగిందన్నారు. టీజీఎస్ ఆర్టీసీ నియమనిబంధనల మేరకే కండక్టర్ పై శాఖపరమైన చర్యలను సంస్థతీసుకుందన్నారు. 

గతంలోనూ శంకర్పై ఇలాంటి ఫిర్యాదులతో రెండు సార్లు సస్పెండ్ చేయడంతోపాటు ఒకసారి ఆయనను విధులనుంచి తొలగించినట్లు తెలిపారు.

టీజీఎస్ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు. ప్రయాణికుల‌కు మెరుగైన, నాణ్యమైన  ర‌వాణా సేవ‌లందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబ‌ద్దత అంకిత‌భావంతో ప‌నిచేస్తున్నారని అన్నారు. 45 వేల ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రతి రోజు స‌గ‌టున 55 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర‌వేస్తుందన్నారు.  విధి నిర్వహణలో సేవాతర్పరత చాటుతున్న సిబ్బందిని ఎక్స్ట్రా మైల్ కార్యక్రమం ద్వారా సంస్థ సత్కరిస్తోందన్నారు. 

ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సంస్థ సీరియస్ గా తీసుకుంటోందన్నారు. వాటిని వీలైనంత త్వరగా విచారణ జరిపి ఫిర్యాదుల విష‌యంలో నిబంధ‌న‌ల ప్రకారమే యాజమాన్యం న‌డుచుకుంటోందన్నారు. అన్ని కోణాల్లో స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపి చర్యలు తీసుకుంటుందన్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్