శిథిలావస్థలో కొత్తగూడెం బస్టాండ్  .. మున్సిపాలిటీ తీరుపై ఆర్టీసీ ఆఫీసర్ల అసహనం 

  • ఆర్టీసీకి రూ. 80లక్షలు ఇస్తామని రెండేండ్లుగా ఊరిస్తున్న మున్సిపాలిటీ
  • అందుకే ఆర్టీసీ నుంచి ఆగిన ఫండ్స్
  • సౌలత్​లు లేక సతమతమవుతున్న ప్రయాణికులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  కొత్తగూడెం బస్టాండ్ ​శిథిలావస్థకు చేరుకుంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.  ఈ బస్టాండ్​కు నిత్యం దాదాపు 500కు పైగా బస్సు ట్రిప్పులు ఉంటాయి. రోజూ దాదాపు 15వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ బస్టాండ్​ నిర్మించి ఐదు దశాబ్దాలు దాటడంతో రిపేర్లు చేయాల్సి ఉంది. అడపా దడపా నామమాత్రపు ఫండ్స్ తో​ చిన్న, చిన్న రిపేర్లు చేస్తూ ఆర్టీసీ అధికారులు మమ అనిపిస్తున్నారు. కానీ వర్షం వస్తే స్లాబ్​నుంచి లీక్​అవుతోంది.

పెచ్చులూడి ప్రయాణికులపై పడుతున్నాయి. టాయిలెట్లు సరిగా లేవు. బస్టాండ్​ అవరణంతా గుంతలమయంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన అప్పటి కలెక్టర్​అనుదీప్, అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మున్సిపల్​ చైర్మన్​ కె. సీతాలక్ష్మితో పాటు మున్సిపల్​ ఆఫీసర్లు, కౌన్సిలర్లతో చర్చించారు. బస్టాండ్​ అభివృద్ధికి రూ. 80లక్షలు ఆర్టీసీకి ఇచ్చేలా మున్సిపాలిటీ పాలకవర్గాన్ని, ఆఫీసర్లను ఒప్పించారు. ఎమ్మెల్యే, కలెక్టర్​ సూచనలతో కౌన్సిల్​ మీటింగ్​లో ఆర్టీసీకి రూ. 80 లక్షలు ఇచ్చేలా తీర్మానం చేశారు. దీంతో ఆర్టీసీ ఆఫీసర్లు, సిబ్బందితో పాటు ప్రజలు ఆనందపడ్డారు. కానీ ఏండ్లు గడుస్తున్నా ఫండ్స్​ మాత్రం రేపుమాపు అంటూ మున్సిపల్​ పాలకులు, అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ తీరుతో ఆర్టీసీ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఆర్టీసీ పై స్థాయి నుంచి ఫండ్స్​ పెద్ద మొత్తంలో రాకపోవడంతో మున్సిపాలిటీ ఇచ్చే ఫండ్స్​తో బస్టాండ్​ను సుందరంగా తీర్చి దిద్దవచ్చని ఆర్టీసీ ఆఫీసర్లు ఆశించారు. ఏండ్లు గడుస్తున్నా మున్సిపాలిటీ నుంచి పైసా రాలేదు.  బస్టాండ్​ అభివృద్ధికి నిధులు ఇస్తామని మున్సిపాలిటీ ప్రకటించడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్టాండ్​ డెవలప్​మెంట్​కు ఫండ్స్​ను రిలీజ్​ చేయడం లేదు. దీంతో ‘రెంటికి చెడ్డ రేవడిలా’ కొత్తగూడెం బస్టాండ్​ తీరు మారిందని ప్రయాణికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బస్టాండ్​ డెవలప్​మెంట్​పై కలెక్టర్​ ప్రియాక అల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఫండ్స్​ కేటాయించేందుకు పరిశీలిస్తున్నాం 

కొత్తగూడెం బస్టాండ్​ అభివృద్ధికి గతంలో రూ. 80లక్షలు కేటాయిస్తామని కౌన్సిల్​ తీర్మానం చేసిన మాట వాస్తవమే. బస్టాండ్​లో ఏ పనులు చేపట్టాలో మున్సిపల్​ ఇంజినీరింగ్​ ఆఫీసర్లు ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఫండ్స్​ లేకపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. 

 రఘు, మున్సిపల్​ కమిషనర్, కొత్తగూడెం

ఆర్టీసీ అందుకే నిధులు ఇవ్వడం లేదు

మున్సిపాలిటీ నుంచి బస్టాండ్​ రిపేర్లకు రూ. 80 లక్షలు కేటాయిస్తామన్నందుకే ఆర్టీసీ నుంచి ఫండ్స్​ రావడం లేదు. అప్పటి కలెక్టర్, ఎమ్మెల్యే కూడా ఫండ్స్​ వస్తాయని చెప్పడంతో భరోసా మీద ఉన్నాం. కానీ మున్సిపాలిటీ ఇప్పటి వరకు పైస కూడా ఇవ్వలేదు. 

 బి. వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, కొత్తగూడెం