ఆర్టీసీ బస్సుల్లో జర్నీపై అధికారుల సర్వే..

ఆర్టీసీ బస్సుల్లో జర్నీపై అధికారుల సర్వే..

హైదరాబాద్, వెలుగు: ప్రజారవాణాలో ఆర్టీసీ బస్సుల ఆదరణ తగ్గకుండా ఉండేందుకు, ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జనాల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఆ సంస్థ అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సిటీలో మెట్రో.. వరంగల్, ఖమ్మం వంటి రైల్వే కనెక్టివిటీ ఉన్న జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు జనం ఏ స్థాయిలో మొగ్గు చూపుతున్నారనే విషయంపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిపోల వారిగా అధికారులు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ జనం నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. బస్ స్టేషన్లలో కూడా మకాం వేసి అక్కడ ఉండే జనాలతో అధికారులు మాట్లాడుతున్నారు. బస్సులు ఎక్కువగా తిరిగే రూట్లపై కూడా దృష్టి పెట్టిన అధికారులు.. జనం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వారి ప్రయాణ అనుభవాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ బాగా పెరగడం, దీంతో బస్సుల్లో ప్రయాణించే జనం పడుతున్న ఇబ్బందులు, బస్సుల్లో పరిశుభ్రత, సీటింగ్ తీరు, ప్రయాణీలకుతో కండక్టర్లు, డ్రైవర్లు విధి నిర్వహణలో ప్రవర్తిస్తున్న తీరును సంబంధిత అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.డిపోల వారీగా సర్వే నిర్వహించిన అనంతరం అధికారులు.. సంస్థ ఎండీ సజ్జనార్ కు ఆన్ లైన్ లో జనం అభిప్రాయాలు, వారి ఇబ్బందులపై  ఒక రిపోర్టును పంపించనున్నారు.