కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండలో అమలు
ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ప్రయోజనం
పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ప్యాసింజర్ల కోసం ఆర్టీసీ ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ను ప్రవేశపెట్టింది. దీన్ని మంగళవారం నుంచి కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్ బస్ భవన్లో ఎండీ సజ్జనార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ టౌఈన్ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్గొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అన్ లిమిటెడ్ గా జర్నీ చేయవచ్చని సజ్జనార్ చెప్పారు. 10 కిలోమీటర్లకు నెలకు రూ.800, ఐదు కిలోమీటర్లకు రూ.500 వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉందని, స్పందన బాగుండడంతో ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను తెచ్చామన్నారు. రోజూ టికెట్‌పై ప్రయాణం చేయాలంటే 10 కిలోమీటర్ల పరిధికి రూ.1,200, ఐదు కిలోమీటర్ల పరిధికి రూ.800 ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని ఈ పాస్‌ను తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, జాయింట్ ఎండీ, ఈడీ పాల్గొన్నారు.
ALSO READ:కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
బీఎస్ఎన్ఎల్నే కొనసాగించండి
ఆర్టీసీలో 15 ఏండ్లుగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు వాడుతున్నారని, ఇప్పుడు ఎయిర్ టెల్కు మార్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ వీఎస్ రావు కోరారు. ఈ మేరకు ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎంప్లాయ్ సిమ్‌తోపాటు వాళ్ల ఫ్యామిలీలో మరో నలుగురికి యాడ్ ఆన్ లో భాగంగా నాలుగు సిమ్ లు ఇచ్చారని, అందరికీ కలిపి నెలకు రూ.180 మాత్రమే చార్జ్ అవుతున్నదని గుర్తు చేశారు. ఎయిర్ టెల్ లో అలా లేకపోవడంతో ఆర్థిక భారం పెరుగుతున్నదన్నారు. ఉద్యోగుల పీఎఫ్‌కు బీఎస్ఎన్ఎల్ నంబర్ లింకై ఉందని, ఇప్పుడు నంబర్ మారిస్తే ప్రతి ఒక్కరికీ కేవైసీ సమస్య వస్తుందని వీఎస్ రావు ఎండీ దృష్టికి తెచ్చారు..