- హైదరాబాద్‌లో టికెట్‌పై రూ.5 పెంచిన ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయి. కనీసం సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి ప్రకటన చేయకుండా సంస్థ చార్జీలు పెంచేసింది. మొన్న పల్లె వెలుగు బస్సుల్లో రౌండఫ్ పేరుతో టికెట్ల రేట్లు పెంచిన సంస్థ.. తాజాగా గ్రేటర్‌లో సేఫ్టీ సెస్, రౌండఫ్తో పేరుతో చార్జీలు పెంచింది. ఒక్కో టికెట్‌పై ఐదు రూపాయల చొప్పున పెంచింది. సిటీలోని ఆర్డినరీ, మెట్రో, మెట్రో డీలక్స్ బస్సుల్లో ధరలు పెంచారు. ఈ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. రోజు కంటే రూ.5 ఎక్కువ తీసుకోవడంతో బస్సులో ప్రయాణికులు కండక్టర్లతో గొడవ పెట్టుకున్నారు. డ్యూటీలో ఎక్కేవరకు తమకు కూడా ఈ విషయం తెలియదని కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు వాపోయారు. అయితే మినిమం చార్జీలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 8 కిలోమీటర్ల వరకు చార్జీలు పెంచలేదు. ఆ తర్వాత టికెట్‌పై రూ.5 పెంచారు. రూ.15 ఉంటే దాన్ని రూ.20గా, రూ.20గా ఉంటే రూ.25గా ఇలా పెంచుకుంటూ పోయారు. అయితే, సేఫ్టీ సెస్ పెంచామని, దాన్ని రౌండింగ్ చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘వీ6 వెలుగు’తో శుక్రావరం చెప్పారు. ఇప్పటికే దేశంలో అన్ని చోట్ల సేఫ్టీ సెస్ ఉందని, కొత్తగా దీన్ని ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. ప్రమాదాల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.