
- మూసివేత దిశగా స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్
- సీసీఎస్ చెల్లింపులు ఏడాదిగా నిలిచిపోవడంతో వడ్డీ లాస్
- జాడేలేని 2017 వేతన సవరణ ఏరియర్స్
- సమస్యల పరిష్కరించాలని ధర్నాకు దిగిన కార్మికులు
మంచిర్యాల, వెలుగు : ఆర్టీసీ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు కష్టపడిన కార్మికులు రిటైర్మెంట్ తర్వాత అంతకుమించి కష్టాలు పడుతున్నారు. డ్యూటీ దిగిపోయి ఏండ్లు గడుస్తున్నా.. తమ బెనిఫిట్స్ అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు మూడు సంవత్సరాలుగా అందకపోగా.. సీసీఎస్ చెల్లింపులు ఏడాదిగా నిలిచిపోయాయి. 2017 వేతన సవరణకు సంబంధించిన ఏరియర్స్ పెండింగ్‌లో ఉండడమే కాకుండా చాలీచాలని పెన్షన్‌తో భారంగా బతుకుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్టీసీ యాజమాన్యం చొరవ చూపి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పెన్షన్ నామమాత్రమే...
రాష్ట్రవ్యాపంగా సుమారు 24 వేల మంది ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఉన్నారు. సర్వీస్‌లో ఉన్నంతకాలం అరకొర జీతాలతోనే పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ అమలు కావడం లేదు. ఈపీఎఫ్ ద్వారా నామమాత్రపు అందే పెన్షన్‌కు తోడు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్ఆర్బీఎస్) ద్వారా అందే ఆర్థికసాయంతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
దశాబ్దాల సేవలు అందించి, డ్యూటీ దిగిన తర్వాత తమ జీవనం దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సర్వీస్ కాలంలో ఫీఎఫ్‌లో దాచుకున్న సొమ్ముకు తోడు గ్రాట్యుటీ, 300 లోపు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వేతన ఒప్పందాల సమయంలో రావాల్సిన ఏరియర్స్, సీసీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు తిరిగి వస్తున్నాయి తప్ప.. ఆర్టీసీ సంస్థ నుంచిగానీ, ప్రభుత్వం తరఫున గానీ ఒక్క పైసా అదనంగా రావడం లేదని అంటున్నారు.
బకాయిలు చెల్లించక ఇబ్బందులు
ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ను 60 ఏండ్లకు పెంచడంతో 2022 జనవరి నుంచి కార్మికులు రిటైర్డ్ అయ్యారు. వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మాత్రమే టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించారు. తర్వాత రిటైర్ అయిన వారికి ఈ డబ్బులు అందలేదు. కొద్దోగొప్పో ఆసరాగా ఉన్న ఎస్‌ఆర్బీఎస్‌ను కూడా మూసివేసేందుకు రెడీ అవుతుండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
చాలా డిపోలు, రీజియన్లలో గ్రాట్యుటీ, రిటైర్మెంట్ నెల జీతం సైతం చెల్లించలేదు. సీసీఎస్‌కు రెగ్యులర్‌గా డబ్బులు చెల్లించకపోవడంతో డిపాజిట్లపై వడ్డీ కోల్పోతున్నారు. అలాగే 2017 పే స్కేల్ అమలయ్యే రిటైర్డ్ కార్మికులు దాదాపు 15 వేల మంది ఉన్నారు. వారికి ఇంతవరకు ఆర్పీఎస్ ఫిక్సేషన్ అమలు కాలేదు. దీంతో ఏరియర్స్ ఎంత వస్తాయో.. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
హయ్యర్ పెన్షన్‌పైనే ఆశలు
ఈపీఎఫ్ మెంబర్స్‌కు హయ్యర్ పెన్షన్ పొందే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. పీనల్ వడ్డీ లేకుండానే ఆర్పీఎస్ 2013, -2017 ఏరియర్స్‌ను ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈసీఎస్)కు చెల్లించే అవకాశాన్ని ఈపీఎఫ్ ఇచ్చింది. అది అమలైతే వారి పెన్షనబుల్ శాలరీ పెరిగి.. ఆ మేరకు పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆర్టీసీ మేనేజ్‌మెంట్ 2017 పేస్కేల్ ఏరియర్స్ చెల్లించకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది.
ఆర్టీసీ మేనేజ్‌మెంట్ పరిధిలోని సమస్యలు
- రిటైర్ అయిన నెలలోపు టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ సహా ఇతర బెనిఫిట్స్ చెల్లించడం.
- 2013, 2017 పేస్కేల్‌కు సంబంధించిన ఈసీఎస్ కంట్రిబ్యూషన్ చెల్లించడంతో పాటు రివైజ్డ్ పీపీవోల కోసం కృషి చేయడం.
- 2021 పేస్కేల్ ప్రకటించి ఏరియర్స్ చెల్లించడం.
- రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్‌లో ఉద్యోగి, స్పౌజ్‌కు రూ. 10 లక్షల చొప్పున పెంచడం
- 2017 ఏరియర్స్‌తో డీఏ ఏరియర్స్ చెల్లింపును ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్‌ను సవరించడం.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి..
- కనీస పెన్షన్ రూ.9 వేలుగా నిర్ణయించి ఈపీఎస్‌కు కరువు భత్యం, వేతన ఒప్పందాలను లింక్ చేయడం.
- చివరి నెల జీతంలో సగం పెన్షన్ చెల్లించడంతో పాటు అర్హులందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయడం.
- 2014 వరకు హయ్యర్ పెన్షన్ కోసం రికవరీ చేసి రిజెక్ట్ చేసిన 16,307 మందికి రావాల్సిన డబ్బులను చక్రవడ్డీతో చెల్లించడం.
- హయ్యర్ పెన్షన్ ఏరియర్స్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధి నుంచి తొలగించడం.
- రిటైర్డ్ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇవ్వడంతో పాటు వైట్ రైషన్ కార్డు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం.