అగ్గితో గోక్కునుడు కాదా ఇది?

అగ్గితో గోక్కునుడు కాదా ఇది?

ఉద్యమ కాలంలో ఆర్టీసీ కార్మికులను పొగిడిన నోటితోనే… ఈ రోజున వాళ్లను
తిట్టిపోస్తున్నారు కేసీఆర్​. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ బాధ్యత ఏదీ లేదు అన్నట్లుగా
నటిస్తున్నారు. బాధ్యత మొత్తం కార్మికుల నెత్తిన వేయాలని చూస్తున్నారు. ఇరుగు
పొరుగు రాష్ట్రాలన్నీ పబ్లిక్​ ట్రాన్స్​పోర్టును కాపాడుకుంటుంటే.. ధనిక రాష్ట్రమైన
తెలంగాణలో మాత్రం డిఫరెంట్​గా వెళ్తున్నారు. కేసీఆర్​ గతంలో అన్నట్లుగా… ‘సీఎం
అగ్గితో గోక్కుంటున్నారు. దీనికి తీవ్ర ప్రతిఘటన ఉంటది’

సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్రను అభినందిస్తూ… నాటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డిని హెచ్చరిస్తూ కేసీఆర్​ అన్న మాటలు ఇవే..  ‘ఆర్టీసీ కార్మిక నాయకులను, ప్రొఫెసర్ కోదండరాం గారిని హైదరాబాద్​లో అరెస్ట్ చేసినారు. నేను ముఖ్యమంత్రిగారికి ఒకటే మాట హెచ్చరిక చేస్తావున్నా. నువ్వు అగ్గితో గోక్కుంటున్నావు. దీనికి తీవ్రమైన ప్రతిఘటన ఉంటది. అరెస్టులకు, లాఠీలకు, తూటాలకు భయపడే బిడ్డలు కాదు తెలంగాణ బిడ్డలు’ అన్నారు కేసీఆర్​.

ప్రజా ఉద్యమంతో తెలంగాణ కల ఫలించి కేసీఆర్​ ముఖ్యమంత్రి కాగలిగారు. అదే నాయకుడు రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే రెవెన్యూ, విద్య, ఆర్టీసీ వర్గాల్లో అసంతృప్తి  రగిలిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల గోస తప్పక వినాలి. ‘డెడ్ లైన్లు’ విధించడం ప్రజాస్వామ్యం కాదు.   ఆర్టీసీ ఏటా రూ. 660 కోట్లకు పైగా స్టూడెంట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు, దివ్యాంగులకు  రాయితీలు ఇస్తోంది. ఇది ఆర్టీసీ విధానం కాదు, ప్రభుత్వ విధానం. ప్రభుత్వమే ఈ డబ్బును ఆర్టీసీకి రీయింబర్స్ చేయాలి. బడ్జెట్​లో ఆర్టీసీకి 520 కోట్ల రూపాయలు ప్రకటించారు, యిచ్చింది 130 కోట్లే. ఈ అన్యాయం వల్ల ఆర్టీసీ అప్పులు చేయాల్సి వస్తోంది. వాటికి వడ్డీలు కట్టాల్సి వస్తోంది.

డీజిల్ ధర విపరీతంగా పెరిగి, వాటిపై మీరు పన్నుల ద్వారా ఆదాయం పెంచుకునుడే తప్ప రోజూ 20 కోట్ల లీటర్ల డీజిల్ వాడే ఆర్టీసీకి పన్ను రాయితీ ఇవ్వడం లేదు. హైదరాబాద్ రోడ్ల వల్ల నగరంలో తిరిగే బస్సులు 400 కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెడుతున్నాయి ఆర్టీసీకి. రోడ్లు అట్లా ఎందుకు ఉన్నాయో, ప్రాధాన్యతలు అట్లా ఎందుకున్నాయో మునిసిపల్ మంత్రిని అడగొచ్చు. నిలదీయాల్సింది మీ మంత్రివర్గ సహచరుల్నీ, అధికారుల్నీ. ఆర్టీసీ యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ నుంచి, సహకార సంస్థ నుంచి 1,400 కోట్ల రూపాయలు వాడుకుంది. అది కార్మికుల చెమట. ఈ ముప్పేట దోపిడీ ఆపడం లేదు,

ఇక, కార్మికులు ఏమంటున్నారో వారి మాటల్లోనే… ఒక్కసారి వినండి: ‘టీఎస్​ఆర్టీసీ ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి ఎండీని ఇంతవరకు నియమించలేదు. ప్రభుత్వం నెలకు ఆర్టీసీ నుంచి సుమారు రూ.750 కోట్లు పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తుంది.  సంస్థకు చెల్లించాల్సిన వివిధ రాయితీల డబ్బు మాత్రం చెల్లించడంలేదు! ఆర్టీసీ సేవా సంస్థ. ఇది ఉపయోగించే డీజల్​పై లీటరుకు 23 రూపాయలు పన్ను.  విమానాల ఇంధనంపై కేవలం 5 రూపాయలే పన్ను! పక్క రాష్ట్రం ఏపీలో సుమారు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్​ కేటాయిస్తే, ఇక్కడ పోయినేడాది కేటాయింపు 520 కోట్లే! ఈసారి అది కూడా లేదు !’

తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇంత వరకు సుమారు 6,500 మంది కార్మికులు రిటైర్మెంటయ్యారు కానీ, ఒక్క ఉద్యోగి కూడా కొత్తగా రిక్రూట్ కాలేదు, ఒక్క కొత్త బస్ కొనలేదు. 68శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేటు 73 శాతానికి పెరిగింది.  కార్మికులు పనిభారం పెరిగి ఒత్తిడి ఎక్కువయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడ రోగం ఉంది? ఏమి వైద్యం చేస్తున్నారు?

కేసీఆర్​ కొత్త మిత్రుడు జగన్​రెడ్డి ఆంధ్రలో ఆర్టీసీని కాపాడుకుంటున్నారు. ఇంకోపక్క తమిళనాడు, కేరళ లాంటివికూడా 2012 తర్వాత పెరిగిన డీజిల్ భారాన్ని తామే మోస్తూ  ప్రభుత్వ ట్రాన్స్​పోర్ట్ వ్యవస్థను ఆదుకుంటున్నారు, ధనిక రాష్ట్రమైన మనమెంత చెయ్యాలి? ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇకనైనా భేషజాలకు పోవద్దు. తెలంగాణను రక్షించుకోవడమే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలి.

శ్రీశైల్ రెడ్డి పంజుగుల, తెలంగాణ జన సమితి