సమ్మర్​ సెలవులను యూజ్​ చేసుకోని ఆర్టీసీ, సింగరేణి

  •     దేశంలోనే  మొట్టమొదటగా మొదలైన టూరిజం ప్రోగ్రాం
  •     సరైన ప్రచారం చేయకపోవడంతో ఆసక్తి చూపని టూరిస్టులు
  •     స్థానికులు, స్టూడెంట్లకు అవకాశమిస్తే రోజూ కళకళ

గోదావరిఖని, వెలుగు :   దేశంలోనే మొదటిసారిగా  కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని   సింగరేణి జీడీకే 7 ఎల్‌‌‌‌ఈపీ గనిలో చేపట్టిన ‘కోల్‌‌‌‌ టూరిజం’కు  బ్రేక్‌‌‌‌ పడింది.  2022  డిసెంబర్‌‌ చివర్లో  సింగరేణి,  టీఎస్‌‌‌‌ ఆర్టీసీ కలిసి  ప్రారంభించిన ఈ ప్రోగ్రాం రెండు నెలలు మాత్రమే కొనసాగింది.  దీనిలో హైదరాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ నుంచి టూరిస్టులను బొగ్గు, కరెంట్ ఉత్పత్తి జరిగే ప్రాంతాలకు తీసుకెళ్లి  చూపించేవారు.

ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..

కోల్‌‌‌‌ టూరిజంలో  భాగంగా ‘సింగరేణి దర్శన్‌‌’ ‌‌ పేరుతో  చేపట్టిన ఈ యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయించింది.   ప్రతీ శనివారం ఈ టూరిజం నిర్వహించేవారు. హైదరాబాద్​ నుంచి వచ్చే టూరిస్టులకు ఒక్కరికి రూ.1,950,  కరీంనగర్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌  నుంచి వచ్చే వారికి రూ.1,050  చార్జి తీసుకున్నారు.  ఇందులో నుంచి  రూ.300 మాత్రమే సింగరేణి సంస్థకు చెల్లించేవారు.  టూరిస్టులు ఉదయం జీడీకే 7 ఎల్‌‌ఈపీ గనిని సందర్శిస్తే  వారికి మ్యాన్‌‌‌‌  రైడింగ్‌‌‌‌ చైర్‌‌‌‌ కార్‌‌‌‌ ద్వారా భూగర్భంలోకి  తీసుకెళ్లి బొగ్గు ఉత్పత్తి ఎలా చేస్తారు..  అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో నడిచే యంత్రాలు,  వాటి పనితీరు తదితర వివరాలను తెలిపేవారు.  అలాగే మధ్యాహ్నం సింగరేణి  రెస్క్యూ స్టేషన్‌‌‌‌ సందర్శించి లంచ్​ బ్రేక్​ తర్వాత 3.30 గంటల టైంలో ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో బొగ్గు కోసం బ్లాస్టింగ్‌‌‌‌ చేసే విధానం,  డంపర్‌‌‌‌, డోజర్‌‌‌‌ వంటి భారీ యంత్రాల గురించిన సమాచారాన్ని తెలిపేవారు. తర్వాత  మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌లోని సింగరేణి పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌కు తీసుకెళ్లి విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి ఎలా జరుగుతుందనే వివరాలను టూరిస్టులకు చెప్పేవారు. రాత్రి వరకు టూరిస్టులను వారి ప్రాంతాలకు చేరవేసేవారు.

స్థానికులకు చాన్స్​ లేదు..

సింగరేణి సంస్థలో కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నా.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు బొగ్గు గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లను చూసే అవకాశం లేదు.  వారితో పాటు  స్టూడెంట్లకు కూడా  అవకాశమిస్తే  వారికి ఫీల్డ్​ లెవల్​ సమస్యలతో పాటు మైనింగ్​ టెక్నాలజీని అర్థం చేసుకుంటారు. సింగరేణి దర్శన్​ కార్యక్రమం   టెక్నాలజీ టూర్​తో పాటు అడ్వెంచర్​ టూరిజం లాగా కూడా ఫీల్​ అవుతారు.  ఈ ప్రోగ్రాంపై ఆర్టీసీ, సింగరేణి సంస్థలు విస్తృత ప్రచారం, మంచి సౌలతులు కల్పిస్తే  టూరిస్టుల రాక పెరిగే చాన్స్​ ఉన్నది.

ఆకట్టుకునేలా  ప్రచారమేది?

ఆర్టీసీకి  ఆమ్దానీ పెంచేందుకు,  సింగరేణిపై  ప్రజలకు అవేర్​నెస్​ కల్పించేందుకు కోల్‌‌‌‌ టూరిజంపై  మొదట్లో ఈ రెండు సంస్థలు  విస్తృత ప్రచారం చేశాయి. సింగరేణి సంస్థ పనితీరు తెలుసుకునేందుకు ప్రారంభంలో ప్రతీ శనివారం టూరిస్టులు బస్సు నిండా వచ్చేవారు.  ఒక బస్సులో 36 మంది టూరిస్టులు వస్తే వారిని రెండు బ్యాచ్​లుగా విడదీసి బొగ్గు గనుల సందర్శనకు తీసుకెళ్లేవారు. సింగరేణి దర్శన్‌‌‌‌ ప్రారంభించిన తర్వాత రెండు నెలల పాటు సాఫీగా కొనసాగిన ఈ యాత్ర టూరిస్టులు రాకపోవడంతో  బ్రేక్‌‌‌‌ పడింది.   మొన్నటి ఎండాకాలం సెలవుల్లో టూరిస్టులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుతం బస్సులో 15 మందికి పైగా వచ్చినా సింగరేణి దర్శన్‌‌‌‌కు తీసుకెళ్లడానికి ఆర్టీసీ  సిద్ధంగా ఉన్నా  వారానికి ఐదుగురిని మించి టూరిస్టులు బుక్‌‌‌‌ చేసుకోవడం లేదు. దీంతో ఆదాయం రాక ఆర్టీసీ సంస్థ సింగరేణి దర్శన్‌‌‌‌ కోసం టూరిజం బస్సును నడపడానికి ముందుకురావట్లేదని తెలుస్తున్నది.  

ప్రతీ రోజు ఉండేలా ప్లాన్​ చేస్తాం

సింగరేణి దర్శన్‌‌‌‌ కు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సును నడిపించినా టూరిస్టుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో సింగరేణి పరిసర ప్రాంతాల స్థానికులకు కోల్‌‌‌‌ టూరిజం చూపించేందుకు ఎంత చార్జి తీసుకోవాలనే  విషయమై ఉన్నతాధికారులతో డిస్కషన్​ చేస్తున్నాం. అలాగే కాలేజీ మేనేజ్ మెంట్లతో మాట్లాడుతున్నాం. ఈ ప్రోగ్రాం  రోజూ ఉండేలా ప్లాన్​ చేస్తాం.

‒ పి.మల్లేశం, ఆర్టీసీ డీఎం, గోదావరిఖని