
- 136 మందిని మళ్లీ డ్యూటీలోకి తీసుకున్న సంస్థ
హైదరాబాద్, వెలుగు: సీఎం ప్రజావాణి చొరవ, ఆర్టీసీ యాజమాన్యం అంగీకారంతో ఆర్టీసీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించబడ్డ 136 మంది ఉద్యోగులను ఆర్టీసీ యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకున్నది. ఇందులో కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన 472 మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ తప్పులను క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఇటీవల ప్రజావాణి ద్వారా విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు..కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా సెర్ప్ సీఈవో, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య మెంబర్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెంబర్ కన్వీనర్ గా త్రీమెన్ కమిటీ వేశారు. ఈ కమిటీ ఆర్టీసీ ఉద్యోగుల విషయాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 136 ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 336 మంది సమస్యలు వినేందుకు తేదీలను ఖరారు చేసి షెడ్యూల్ ప్రకటించారు.