ఆర్టీసీలో చర్చలపై కోడ్​ ఎఫెక్ట్

ఆర్టీసీలో చర్చలపై కోడ్​ ఎఫెక్ట్
  • కార్మికుల సమ్మె నోటీసుపై చర్చలకు వెళ్లని యాజమాన్యం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో కార్మికుల సమ్మె నోటీసుపై ఇటు జేఏసీ ప్రతినిధులను అటు యాజమాన్యంను సోమవారం కార్మిక శాఖ చర్చలకు పిలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున తాము చర్చలకు రాలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో  చర్చలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగియగానే మరోసారి ఇరు వర్గాలతో చర్చలు జరపాలని కార్మిక శాఖ నిర్ణయించింది. చర్చల కోసం కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లిన జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, ఇతర నేతలు ఇటు ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, అటు కార్మిక శాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కై కావాలనే తమ సమ్మె నోటీసుపై చర్చలు జరపకుండా, తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గత నెల 27 న ఆర్టీసీ జేఏసీ నేతలు ఇటు యాజమాన్యానికి అటు లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 21 డిమాండ్లతో నోటీసు ఇవ్వడంతో దీనిపై స్పందించిన రాష్ట్ర లేబర్ కమిషనర్.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని లేబర్ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ తో చర్చలకు రాలేకపోతున్నామని ఆర్టీసీ అధికారులు లేబర్ కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.