- ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఏకమైన కార్మిక సంఘాలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో హైర్పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు నిర్ణయించాయి. ఈ నెల 27 న హైదరాబాద్ లోని బస్ భవన్ ముందు ప్రదర్శన నిర్వహించి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే హైర్ పద్ధతిన బస్సులు ప్రవేశపెడుతున్నారని ఆరోపిస్తున్న కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీస్కున్నాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు తరలిరావాలని జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి కార్మికులకు విజ్ఞప్తిచేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని, ఈ– బస్సుల నిర్వహణను కూడా ఆర్టీసీకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ తో జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కూడా నెరవేర్చాలని, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలనే డిమాండ్లనూ సమ్మె నోటీసులో పెడ్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు తమ ఐక్యతను చాటుకునేలా జనవరి 27 న పెద్ద సంఖ్యలో బస్ భవన్‌కు తరలిరావాలని, సమ్మె నోటీసు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.