యూనియన్​ దిశగా ఆర్టీసీ కార్మికులు

యూనియన్​ దిశగా ఆర్టీసీ కార్మికులు

 

  • రెండేండ్ల కింద సంఘాలను రద్దు చేసిన సర్కారు 
  • వెల్ఫేర్​ కమిటీ ఏర్పాటు చేసినా ఒరిగిందేమీ లేదు
  • సమస్యలు చెప్పుకునేదెలా అంటున్న కార్మికులు 
  • జేఏసీగా ఏర్పడి పోరాటం షురూ 
  • గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరపాలని డిమాండ్
  • రెండు రోజులుగా సంతకాలు సేకరణ  


కరీంనగర్, వెలుగు:  ఆర్టీసీ కార్మికులు హక్కులు సాధించుకోవడానికి మళ్లీ ఒక్కటవుతున్నారు.  రోజూ తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఏదో ఒక డిపో ముందు యూనియన్లు లేకుండా ధర్నాలు చేస్తున్న కార్మికులంతా ఫస్ట్​టైం కలిసి నిరసన చేసేందుకు రెడీ అవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని 2019లో రెండు నెలల పాటు సమ్మె చేసి విఫలమై విరమించారు. అప్పుడు యూనియన్లతో నష్టం జరుగుతోందని, రద్దు చేసి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కారు. కానీ ఇప్పటివరకు దాని వల్ల కార్మికులకు ఒరిగిందేమీ లేదు. దీంతో విసుగెత్తి మరోసారి యూనియన్​గా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు.  

వెల్ఫేర్​కమిటీ చేసిందేమీ లేదు 
సమ్మె తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘాలను రద్దు చేసిన కేసీఆర్​సమస్యల పరిష్కారానికి యూనియన్ల అవసరం లేదని డిపోకు కొంతమంది చొప్పున 2019 డిసెంబర్​1న మీటింగ్​కు పిలిచారు. కార్మికులతో స్వయంగా లంచ్​చేసిన సీఎం..సంస్థ నష్టాల్లో నుంచి బయటపడేలా చేస్తానన్నారు. దీనికి కలిసికట్టుగా పని చేయాలని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఉండదని, ఎన్నికలు అవసరం లేదన్నారు. టెంపరరీగా వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కార్మికులు లేకుండా కేవలం ఆర్టీసీ ఆఫీసర్లు, ఇతర ప్రభుత్వ ఆఫీసర్లను వేశారు. ఇది జరిగి ఇప్పటికి రెండేండ్లు దాటుతున్నా ఒక్కసారి మాత్రమే కమిటీ మీటింగ్ జరిగింది. కానీ, కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. వెల్ఫేర్ కౌన్సిళ్ల కాలం కూడా ముగియడంతో పై అధికారుల వేధింపులు, పని ఒత్తిడి గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. 

 సంతకాల సేకరణతో షురూ 
సీఎం కేసీఆర్‍ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, అంతేగాకుండా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని సంఘటితంగా పోరాడాలని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి.  ఇందులో భాగంగా ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వారీగా సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టాయి. గుర్తింపు సంఘాలకు ఎన్నికలతో పాటు 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్‍సీ ఇవ్వాలని వీరు డిమాండ్​చేస్తున్నారు. 2019 నుంచి పెండింగ్‍లో ఉన్న  ఆరు డీఏలు ఇవ్వాలని, 2013 పీఆర్‍సీకి సంబంధించి 50 శాతం బాండ్‍ డబ్బులు మంజూరు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డిమాండ్ల గురించి అందరు కార్మికులకు తెలిసేలా సంతకాల సేకరణ చేపడుతున్నారు.  

యూనియన్లు ఉండాల్సిందే
యూనియన్లతోనే కార్మికుల సమస్యల పరిష్కారమవుతాయి, ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్​మెంట్​అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు నష్టోపోతున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వేసిన సంక్షేమ కమిటీ చేసిందేమి లేదు. ఉన్నతస్థాయిలో వేసిన కమిటీలో ప్రభుత్వం ఒక్కసారి కూడా కార్మికుల సంక్షేమం గురించి చర్చించింది లేదు. కార్మికులపై మరింత పనిభారం పెరిగింది. అందుకే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. సంఘటితంగా పోరాడాలనే ఉద్దేశ్యంతో జేఏసీ ఏర్పాటు చేశాం.  – టీఆర్‍ రెడ్డి, ఆర్టీసీ ఈయూ రీజినల్‍ జనరల్ సెక్రెటరీ, కరీంనగర్‍