అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..30 నిమిషాల జర్నీ కేవలం 5 నిమిషాల్లోనే

అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..30 నిమిషాల జర్నీ కేవలం 5 నిమిషాల్లోనే

హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన ప్రారంభించబోతుంది.  ఈ మేరకు మంత్రి కేటీఆర్ అధికారిక ప్రకటన చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ను ఆగస్టు 19వ తేదీన ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 

2020 జులై 10న ఈ ఫ్లైఓర్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్‌ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్‌ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్‌ పిల్లర్లు 81 ఉండగా.., 426 దూలాలు నిర్మించారు. మొత్తం 2.63 కి.మీ పొడవైన స్టీల్ బ్రిడ్జి తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలో మీటర్ల  దూరంలో 5 జంక్షన్లతో వాహనదారులు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు దాటి విద్యానగర్‌ వైపు వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణంతో  లోయర్‌ ట్యాంక్‌ నుంచి వీఎస్టీ వరకు కేవలం 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.  దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కి. మీ స్టీల్‌ బ్రిడ్జి ఇది.  హైదరాబాద్ సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లైఓవర్‌ గా ఈ స్టీల్  వంతెన ప్రత్యేకతను దక్కించుకుంది. కాంక్రీట్‌ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువే.. కానీ తక్కువ టైంలో నిర్మాణాలను పూర్తి చేయొచ్చు. అంతేకాదు ఇలాంటి స్టీల్ బ్రిడ్జిలు వందేళ్లకు పైగా మన్నిక ఉంటుందట.