
- ఆర్టీఐ కమిషనర్లు ఎవరో .. రెండున్నరేండ్లుగా ఖాళీగా పోస్టులు
- మార్చి మొదటి వారంలోపు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం
- ఎంపికలో ప్రతిపక్ష నేత అభిప్రాయమూ తీసుకోవాల్సిందే
- 17 వేలకు పైగా పేరుకుపోయిన అప్పీళ్లు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ కమిషనర్ పోస్టుల కోసం రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు. ఈనెల మొదటి వారంలోపు పూర్తి సమాచార కమిషనర్ల నియామకాన్ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే ఆర్టీఐ చీఫ్కమిషనర్తో పాటు ఇతర కమిషనర్ల నియామకం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి చడీచప్పుడు లేకపోవడంతో ఈసారి కూడా వాయిదా పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ప్రధాన సమాచార కమిషనర్ 2020 ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023 ఫిబ్రవరి 24న తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చేవారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలూ సరిగా లేవు. ఇక అప్పీలు చేద్దామంటే రాష్ట్ర స్థాయిలో కమిషనే లేదు. ఫలితంగా 17 వేలకు పైగా అప్పీళ్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయంలో పేరుకుపోయాయి.
ప్రభుత్వ ఆఫీసుల్లో పబ్లిక్ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ఉంటారు. ఏదైనా సమాచారం కోసం ఆయనకు దరఖాస్తు చేస్తే సమాచారం ఇస్తారు. ఒకవేళ పీఐఓ సమాచారం ఇవ్వకపోతే.. అదే ఆఫీసులో పైస్థాయి అధికారి అప్పిలేట్గా ఉంటారు. అక్కడ కూడా సమాచారం రానప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆఫీసులో అప్పిలేట్ చేస్తారు. పైస్థాయిలో కమిషనర్లు లేకపోవడంతో.. కింది స్థాయిలో అధికారులు ఎవరూ కూడా సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రెండుసార్లు నోటిఫికేషన్
సమాచార కమిషనర్ల నియామకంపై గత ప్రభుత్వం 2023 జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 డిసెంబరులో ప్రభుత్వం మారడం, తర్వాత లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే.. ఓ ప్రధాన కమిషనర్, ఆరుగురు కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం నిరుడు జూన్‌లో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులను ఆదేశించారు.
ఆ దిశగా కసరత్తు చేసిన అధికారులు.. ఓ జాబితాను సిద్ధం చేసి ఇంటెలిజెన్స్ విచారణ కూడా చేపట్టారు. కానీ, నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే, సమాచార కమిషనర్ నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియను ప్రారంభించామని, త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే.. ఆర్టీఐ కమిషనర్లను నియమించాలంటే సీఎం అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు సీఎం అపాయింట్చేసిన కేబినెట్‌మంత్రి ఉంటారు.
ముగ్గురిలో మెజారిటీ నిర్ణయం ప్రకారం సమాచార కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఈ కమిటీ సిఫారసు మేరకు గవర్నర్ వారిని నియమిస్తారు. కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఇంతవరకు కమిటీ ప్రక్రియ మొదలుపెట్టలేదని తెలుస్తోంది. పైగా మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కూడా ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై సమాచారం వెళ్లలేదని తెలిసింది. ఆరు కమిషనర్పోస్టుల్లో కనీసం రెండు పోస్టులను ప్రధాన ప్రతిపక్ష నేత సూచించాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
మస్తు పోటీ
రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషన్‌లో చోటు కోసం రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, జర్నలిస్టులు, అడ్వొకేట్లు పెద్దఎత్తున పోటీపడుతున్నారు. రెండున్నరేండ్లుగా ఖాళీగా ఉన్న కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు ఆరుగురు కమిషనర్లను నియమించాల్సి ఉంది. మొత్తం ఏడు పోస్టులకు దాదాపు 750 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 55 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లవే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సీఎస్ శాంతికుమారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దరఖాస్తులను నిశితంగా పరిశీలించింది.
దరఖాస్తుదారుల్లో ఆర్టీఐ అమలుకు కృషి చేసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ఆర్టీఐ నిపుణులు కూడా ఉన్నారు. ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామకమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా ప్రమోట్ అయ్యే లేదా నియామకం పొందే అర్హత ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లకు మించి కొనసాగడానికి వీలు లేదు.