కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ భారీగా అద్దె బాకీ

కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఏండ్లుగా కిరాయి చెల్లించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి, పార్టీ చీఫ్​ సహా పలువురు నాయకులు ఉండే ఇండ్లను సర్కారు నుంచి అద్దెకు తీసుకుని వాడుకుంటూ ఏళ్ల తరబడి బకాయి పడ్డారు. సమాచార హక్కు కార్యకర్త సుజిత్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది. హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ నుంచి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యాలయాలకు మూడేళ్ల గడువుతో కిరాయికి భవనాలను వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ లోపు ఆయా పార్టీలు వాటికి కేటాయించిన స్థలంలో సొంత కార్యాలయాలు నిర్మించుకుని, కేంద్రం ఇచ్చిన బిల్డింగ్‌లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న భవనాలను ఆ గడువు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ మళ్లీ పొడిగించుకుంటూ వస్తోంది. పైగా ఆ బిల్డింగ్‌ కిరాయి కూడా కట్టడం లేదు. సుజిత్ పటేల్ ఆర్టీఐ పిటిషన్‌కు ఇచ్చిన రిప్లై ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి సంబంధించిన రెంట్‌ను 2012 డిసెంబర్‌‌ నుంచి చెల్లించలేదు. అంటే తొమ్మిదేళ్లు పూర్తయి.. పదో ఏడాది నడుస్తోంది. ఇన్నేండ్లుగా మొత్తం రూ.12,69,902 చెల్లించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది.

సోనియా గాంధీ, ఆమె సెక్రెటరీ ఇండ్ల అద్దె కూడా కట్టలే

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెంట్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా కేంద్రానికి కిరాయి భారీగా పెండింగ్ పడ్డారు. 10 జన్‌పథ్‌ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ చీఫ్​ సోనియా గాంధీ నివాసానికి సంబంధించి 2020 సెప్టెంబర్ నుంచి కిరాయి చెల్లించాల్సి ఉంది. ఇక సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీ విన్సెంట్‌ జార్జ్‌ ఢిల్లీలోని చాణక్యపురి ఏరియాలో కేంద్రం కేటాయించిన భవనంలో ఉంటున్నారు. కానీ ఆయన కూడా 2013 ఆగస్టు నుంచి రెంట్ కట్టలేదని, ఐదు లక్షల 7 వేల 911 రూపాయలు బకాయిపడ్డారని కేంద్రం తెలిపింది. 

2013లోనే ముగిసిన గడువు

ఢిల్లీలో సొంత కార్యాలయం కట్టుకునేందుకు 9ఏ రోజ్ అవెన్యూలో కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. 2010 జూన్‌లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్థలంలో కొత్త బిల్డింగ్‌ను కట్టుకుని.. రూల్ ప్రకారం 2013 నాటికి అక్బర్‌‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అనేక మార్లు గడువు పొడిగింపు చేసుకుంటూ వస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ

లఖింపూర్ ఖేరి కేసు: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల